ఏపీ సచివాలయ సమన్వయ సంఘం సమావేశంలో చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యోగులందరూ మొన్న ఏ స్ఫూర్తితో కలిసికట్టుగా ముందుకు వచ్చారో అదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలిచేవిధంగా తనను ముందుకు నడిపించే బాధ్యత తీసుకోవాలని సీమాంధ్ర ప్రాంత సచివాలయ ఉద్యోగులను ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా గురువారం సచివాలయానికి వచ్చిన చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ సచివాలయ సమన్వయ సంఘం సన్మానించింది. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ... ఉద్యోగుల సర్వీసు రూల్స్ చూసేందుకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
సచివాలయ సమన్వయ సంఘం చైర్మన్ మురళీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికోసం తమ వంతు కృషి చేస్తామన్నారు. నూతన రాజధాని ఏర్పాటు కోసం సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు రెండు రోజుల వేతనాన్ని ఇస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కామినేని శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఉద్యోగ సంఘం నేతలు రామాంజనేయులు, వెంకటసుబ్బయ్య, మద్దిలేటి, హరీష్ కుమార్‌రెడ్డి, జి.రామక్రిష్ణ, రమణయ్య, ఇంద్రాణి తదితరులు పాల్గొన్నారు.