
అమరావతి : భగ్గమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కంటితుడుపుగా స్వల్ప ఉపశమన చర్యలు ప్రకటించారు. పెట్రో ధరలు విపరీతంగా పెరుగుతున్నా.. అదనపు వ్యాట్‌ను పూర్తిగా ఎత్తివేయకుండా స్వల్పంగా తగ్గించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలపై అదనపు వ్యాట్ రూపంలో లీటరుకు నాలుగు రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతూ ఉండటాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పదేపదే తన ప్రసంగంలో ప్రస్తావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌పై అదనంగా వసూలు చేస్తున్న నాలుగు రూపాయల వ్యాట్‌ను 2 రూపాయలకు తగ్గించారు. పెట్రోల్, డీజిల్‌పై అదనపు వ్యాట్ విధిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశే కావడం గమనార్హం. పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర పన్నుగా వ్యాట్ విధించడమే కాకుండా.. అదనపు వ్యాట్‌ను కూడా ప్రభుత్వం వసూలు చేస్తోంది. దీంతో పెట్రోల్‌పై 31 శాతం, డీజిల్‌పై 22.25 శాతం వ్యాట్‌ను ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తోంది. వ్యాట్ భారం మాత్రమే కాక, అదనపు వ్యాట్ భారం కూడా ఏపీ ప్రభుత్వం ప్రజల నెత్తిన వేస్తుండటంతో ఏపీ పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్రం వసూలు చేస్తున్న వ్యాట్ నుంచి తమకు విముక్తి కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను అదుపులోకి తీసుకురావడం కోసం వాటిని జీఎస్టీలో చేర్చాలనే ప్రజలు డిమాండ్ చేస్తుండగా.. చంద్రబాబు మాత్రం దానిని వ్యతిరేకించారు. రాష్ట్రాల ఆదాయం కోల్పోతాయనే నెపంతో వాటిని జీఎస్టీలోకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు సముఖత చూపించలేదు. అయితే పెట్రోమంటకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న బంద్, హర్తాళ్లు.. ఆదివారం విశాఖలోని కంచరపాలెంలో జరిగిన వైఎస్ జగన్ సభకు ప్రజలు సునామీలా తరలిరావడం.. ప్రజా వ్యతిరేకత అంతకంతకూ పెరిగిపోతుండటంతో చంద్రబాబు ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో పెట్రో ధరలపై అదనపు వ్యాట్ కొంత తగ్గించి చేతులు దులుపుకుంది. ఇన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నా.. కనీసం ఎలాంటి ప్రకటన చేయని చంద్రబాబు ప్రస్తుతం స్వల్పంగా ఈ అదనపు వ్యాట్‌ను తగ్గించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ. 2 అదనపు వ్యాట్ తగ్గింపు.. రేపటి నుంచి అమలు చేయనున్నట్టు అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment