
మాఫీ కాదు..రీషెడ్యూలే!
వ్యవసాయ రుణాలపై చంద్రబాబు తరుణోపాయం
ఏపీలో రుణ మాఫీపై అడుగు ముందుకు పడని వైనం
కోటయ్య కమిటీ ప్రాథమిక నివేదికకు గడువు పూర్తి
సీఎం చంద్రబాబుతో కమిటీ సభ్యుల సమావేశం
ఎంత మేర రుణ భారం భరిస్తారో చెప్పాలన్న కమిటీ
దానిపై ఆర్‌బీఐతో మాట్లాడాలని కమిటీకి బాబు సూచన
ఇప్పటికి మాఫీ గండం గట్టెక్కటానికి ‘రీషెడ్యూల్’ మంత్రం
సాక్షి, హైదరాబాద్: రైతులు తీసుకున్న అన్ని రకాల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని, తొలి సంతకం దానిపైనే అంటూ తొలి సంతకం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు వీలైనంత మేర రుణ మాఫీ అంశంపై కాలయాపన చేసే ఎత్తుగడలు వేస్తున్నారు. ఇప్పుడు రుణ మాఫీ కాదు.. రైతుల రుణాల రీషెడ్యూల్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. రుణ మాఫీ విధివిధానాలు రూపొందించడంపై నాబార్డు మాజీ చైర్మన్ కోటయ్య నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ.. ముందుగా నిర్ణయించిన గడువు మేరకు ఆదివారం తన ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. కమిటీ చైర్మన్ సహా ఇతర సభ్యులు ఆదివారం సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు కానీ ఎలాంటి నివేదికనూ సమర్పించలేదు. అయితే.. ప్రభుత్వం ఎంత మేర రుణ భారాన్ని భరిస్తుందో తెలియజేస్తే అందుకు అనుగుణంగా విధివిధానాలను రూపొందిస్తామని కోటయ్య కమిటీ సీఎం చంద్రబాబుతో పేర్కొన్నట్లు తెలిసింది.
పభుత్వం ఎంత మేర రుణ భారాన్ని భరిస్తుందనేది చంద్రబాబు చెప్పలేదని.. ఆ విషయాన్ని కూడా ఆర్‌బీఐతో చర్చించిన తరువాతనే చెప్పగలమని, ఆర్‌బీఐతోనూ కోటయ్య కమిటీయే చర్చించి ఎంత మేర రుణ భారం భరించవచ్చో అంచనాకు రావాలని సూచించారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీంతో.. ఎంత మేర రుణ భారం భరించగలదో ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చిన తరువాతనే విధివిధానాలను రూపొందించాలని కోటయ్య కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ మేరకు ప్రాథమిక నివేదికను సమర్పించేందుకు ప్రభుత్వం మరో 10 రోజుల అదనపు గడువును కూడా కమిటీకి ఇచ్చింది. ప్రాథమిక నివేదికకే 10 రోజులు ఆలస్యమైతే.. ఆ తర్వాత ఇవ్వాల్సిన తుది నివేదికకు మరింత ఆలస్యమవుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఆ నివేదిక వచ్చి రుణ మాఫీ అమలయ్యేసరికి ఖరీఫ్ సీజన్ కాస్తా ముగిసిపోయినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
రీషెడ్యూల్‌కు ఆర్‌బీఐని ఒప్పించే యోచన...
మరోవైపు.. ఇప్పటికిప్పుడు రుణ మాఫీ సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఖరీఫ్‌లో రైతులకు కొత్త రుణాలు ఇప్పించడం ఎలాగ అనే అంశంపై దృష్టి సారించింది. ఇందుకు గత ఆర్థిక సంవత్సరంలో రైతులు తీసుకున్న రుణాలను రీషెడ్యూల్ చేయించి కొత్త రుణాలు మంజూరు చేయించాలని స్థూలంగా నిర్ణయించారు. గత ఖరీఫ్‌లో కరువు కారణంగా, తుపాను కారణంగా 575 మండలాల్లో రైతులు పంటలను నష్టపోయారు. అయితే అప్పటి ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించడంలో తీవ్ర జాప్యం చేసింది. కరువు సంభవించిన 90 రోజుల్లో ఆ మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తేనే రైతుల రుణాలను రీషెడ్యూల్ చేయడానికి ఆర్‌బీఐ నిబంధనలు అంగీకరిస్తాయి. కరువు మండలాలను ప్రకటించడంలో అప్పటి ప్రభుత్వం జాప్యం చేయడంతో ఇప్పటి వరకు ఆ మండలాల్లోని రైతుల రుణాల రీషెడ్యూల్‌కు ఆర్‌బీఐ అనుమతించలేదు. ఇప్పుడు ఇదే విషయాన్ని ఆర్‌బీఐ దృష్టికి తీసుకువెళి,్ల నిబంధనలు సడలింపచేసి రుణాలను రీషెడ్యూల్ చేయించడం ద్వారా ఇప్పటికిప్పుడు రుణ మాఫీ గండం నుంచి గట్టెక్కాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. రైతుల రుణాలను రీషెడ్యూల్ చేయిస్తే, తక్షణం తదుపరి రుణాలు లభిస్తాయి కనుక రైతులకు ఇబ్బంది ఉండదనేది సర్కారు అభిప్రాయంగా చెప్తున్నారు.
నగదు చెల్లిస్తేనే రుణ మాఫీ అన్న ఆర్‌బీఐ: వ్యవసాయ రుణ మాఫీకి సహకరించాలని చంద్రబాబు ఆర్‌బీఐ గవర్నర్‌కు లేఖ రాసినప్పటికీ ఇప్పటి వరకు స్పందన రాలేదు. దీనిపట్ల ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అయితే చంద్రబాబు లేఖ రాయడానికి ముందే ఆర్‌బీఐ ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు రుణ మాఫీపై లేఖలు రాసిన విషయం తెలిసిందే. రుణ మాఫీ చేయాలంటే, రైతులు చెల్లించాల్సిన రుణాల మొత్తాన్ని నగదు రూపంలో ఆయా ప్రభుత్వాలు బ్యాంకులకు చెల్లించాల్సిందేనని ఆ లేఖలో ఆర్‌బీఐ స్పష్టంగా పేర్కొంది.
ఆర్‌బీఐ అంగీకరిస్తేనే రీషెడ్యూల్: ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో ఇప్పటి వరకు రైతులు తీసుకున్న రుణాలు ఎంత మేర బకాయిలున్నాయనే వివరాలన్నీ కోటయ్య కమిటీ సేకరించింది. అందులో సన్న, చిన్నకారు రైతులు ఎంత మంది, వారి పేరున ఉన్న రుణాలెన్ని, బంగారాన్ని కుదవపెట్టి తీసుకున్న వ్యవసాయ రుణాలెన్ని, అందులో మహిళల పేరు మీద ఉన్న రుణాలెన్ని? అనే వివరాలను కోటయ్య కమిటీ పూర్తి స్థాయిలో సేకరించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎంత మేర రైతుల పేరు మీద ఉన్న రుణాలను బ్యాంకులకు చెల్లిస్తుందో చెప్తే.. ఏ రైతుకు ఎంత మేర రుణాలు మాఫీ చేయాలనే విధివిధానాలను రూపొందించగలమని కోటయ్య కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దీంతో ఇప్పటి వరకు కోటయ్య కమిటీ చేసిన కసరత్తు వల్ల రుణ మాఫీ అంశం ఎటూ తేలకుండా అయింది. ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపుల తరువాతనే రుణ మాఫీ ఎంతవరకు చేయగలమనే నిర్ణయానికి రావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్‌బీఐ అంగీకరిస్తే రైతుల రుణాలు రీషెడ్యూల్ చేసి కొత్త రుణాలను మంజూరు చేస్తారు. లేదంటే అంతే సంగతులు.