
ప్రకటనలతో చంద్రబాబు కాలయాపన
వెంకటాచలం: అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రకటనలతోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాల యాపన చేస్తున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. సామాజిక పింఛన్ల కమిటీల్లో టీడీపీ కార్యకర్తలను నింపి ఆర్భాటం చేస్తున్న చంద్రబాబులో ప్రజలకు మేలు చేయాలన్న ధోరణి కనిపించడం లేదని దుయ్యబట్టారు. ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చి పార్టీ కార్యకర్తలను కమిటీల్లో వేయడం ఏంటని ఆయన సూటిగా ప్రశ్నించారు. పింఛన్ల కమిటీల నిర్వాకంతో అర్హులకు అన్యాయం జరిగితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఒక కుటుంబంలో ఒకరికే పింఛన్ అంటూ పెన్షన్లు పొందుతున్న వారిని ఆందోళనకు గురిచేస్తున్నారని అన్నారు.
వికలాంగులకు 80 శాతం వికలత్వం ఉంటేనే రూ. 1,500 పెన్షన్ ఇస్తామని చెప్పడం చూస్తుంటే ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కోసం వికలత్వం పొందాలా అని ఆయన గట్టిగా ప్రశ్నించారు. రుణమాఫీ పేరుతో రైతులను , స్వయం సహాయక సంఘాల మహిళలను మోసం చేశారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదని దుయ్యబట్టారు. కాగా ఎమ్మెల్యేతో పాటు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ స్టీరింగ్‌కమిటీ సభ్యులు బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, జెడ్పీటీసీ మందల వెంకటశేషయ్య, ఎంపీపీ తలపల అరుణ, మండల పరి షత్ ఉపాధ్యక్షులు శ్రీధర్ నాయుడు, సర్పంచ్ పోట్లూరు మణెమ్మ, కోడూరు ప్రదీప్‌రెడ్డి, కనుపూరు కోదండరామిరెడ్డి, డబ్బుగుంట వెంకటేశ్వర్లు, మందల పెంచలయ్య, నడవల నాగ రాజా గౌడ్,పాశం ప్రభాకర్, నాటకం శ్రీనివాసులు, వెలిబోయిన వెంకటేశ్వర్లు, కొణిదన మోహన్ నాయుడు, కొణిదన విజయ భాస్కర్ నాయుడు, అడపాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.