నాగులుప్పలపాడు, న్యూస్‌లైన్ : ఓట్ల కోసం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ర్ట కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులను ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవసాయం దండగని మాట్లాడిన ఆయన..ప్రస్తుతం ఓట్లు, అధికారం కోసం రైతు సంక్షేమమే ధ్యేయమని, తాను అధికారంలోకి రాగానే వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు సోమవారం జిల్లాకు వచ్చిన నాగిరెడ్డి.. నాగులుప్పలపాడు మండలంలోని బి.నిడమానూరు గ్రామంలో సాగుచేస్తున్న పంటలను పరిశీలించారు. పత్తి, పొగాకు, తదితర పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వ్యవసాయం చేయాలంటేనే రైతులు భయపడుతున్నారని పేర్కొన్నారు. పంటలు సాగుచేసేందుకు పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయని, చేతికొచ్చిన పంటకు గిట్టుబాటు ధరలు మాత్రం సగానికిపైగా పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఆరుగాలం కష్టపడిన రైతుల పరిస్థితి దయనీయంగా మారుతోందన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 483 రూపాయలున్న డీఏపీ ఎరువుల బస్తా ధర ప్రస్తుతం 1,350 రూపాయలకు పెరిగిందన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు చూస్తే.. వైఎస్‌ఆర్ హయాంలో 6,000 రూపాయలున్న పత్తి ధర ప్రస్తుతం 3,000 రూపాయలకు పడిపోయిందన్నారు. దీన్నిబట్టి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతు సంక్షేమంపై ఏపాటి శ్రద్ధ ఉందో అర్థమవుతోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని నాగిరెడ్డి డిమాండ్ చేశారు. ఏమాత్రం భద్రత లేని రంగంగా వ్యవసాయరంగం మారిందని, ఇదే పరిస్థితి కొనసాగితే రైతులంతా వ్యవసాయం మానుకుని ఇతర రంగాలను ఎంచుకుంటారని పేర్కొన్నారు.
అదే జరిగితే భవిష్యత్తులో ఆహార ధాన్యాల సమస్య తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 70 వేల కోట్ల రూపాయల పంట రుణాలతో పాటు రైతుమిత్ర, తదితర రుణాలు 1.25 లక్షల కోట్ల రూపాయలున్నాయని, వాటన్నింటినీ మాఫీ చేయడం సాధ్యమయ్యేపనికాదని నాగిరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు వాస్తవాలు తెలుసుకోకుండా ఓట్ల కోసం అలివిగాని హామీలిస్తూ రైతులను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. వైఎస్‌ఆర్ సీపీ డిమాండ్ మేరకు ప్రకృతి వైపరీత్యాలు, ఇతర కారణాల వల్ల పంట నష్టపోయిన రైతుల రుణాలు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నాగిరెడ్డి వెంట వైఎస్‌ఆర్ సీపీ రైతు విభాగం జిల్లా కన్వీనర్ మారెడ్డి సుబ్బారెడ్డి, పలువురు రైతులు ఉన్నారు.
చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదం
Published Tue, Jan 14 2014 2:23 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement
Advertisement