బాబువన్నీ పచ్చి అబద్ధాలు | Nagi reddy fires on cm chandrababu | Sakshi
Sakshi News home page

బాబువన్నీ పచ్చి అబద్ధాలు

Published Tue, Nov 17 2015 2:21 AM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM

బాబువన్నీ పచ్చి అబద్ధాలు - Sakshi

బాబువన్నీ పచ్చి అబద్ధాలు

♦ రైతు రుణాలన్నీ మాఫీ అయ్యాయా?
♦ బ్యాంకుల్లో జమపడింది రూ.7,200 కోట్లే
♦ వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి
 
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శంకుస్థాపన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పారని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అలా కాదని అంటే ఎక్కడైనా, ఎప్పుడైనా తాను చర్చకు రావడానికి సిద్ధమేనని చెప్పారు. నాగిరెడ్డి సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుతో మాట్లాడారు. రూ.24,000 కోట్ల మేర రైతు రుణాలను మాఫీ చేసినట్లు ముఖ్యమంత్రి చెప్పుకున్నారని, అది తొలి అవాస్తవమని విమర్శించారు.

తాకట్టులో ఉన్న మహిళల పుస్తెల తాళ్లు, దస్తావేజులను విడిపించి తెచ్చారా? రుణాలన్నీ మాఫీ అయ్యాయా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మొత్తం రైతు రుణాలు రూ.87,000 కోట్లు ఉండగా వాటిపై వడ్డీ రూ.13,000 కోట్లు అయిందన్నారు. ఇందులో ఇప్పటివరకు రుణమాఫీ కింద బ్యాంకుల్లో జమ పడింది రూ.7,200 కోట్లేనని వివరించారు. చంద్రబాబు చెబుతున్నట్లు రూ.24,000 కోట్ల మేర రుణాలు మాఫీ అయిన రైతుల జాబితాను ప్రకటించాలని నాగిరెడ్డి డిమాండ్ చేశారు. 4 లక్షల ఎకరాలకు భూసార పరీక్షలు చేసినట్లుగా మరో అబద్ధం చెప్పారని మండిపడ్డారు.

పట్టిసీమ నుంచి జూలైలోనే కృష్ణా డెల్టాకు నీళ్లిస్తామని ఒకసారి, ఆగస్టు 15 నాటికి ఇస్తామని మరోసారి ప్రకటించారని గుర్తుచేశారు. వాస్తవానికి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ డెల్టాలో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. కృష్ణా డెల్టా రైతులు దారుణంగా నష్టపోతున్నట్లు చంద్రబాబు అనుకూల మీడియాలోనే వార్తలు వచ్చాయని వెల్లడించారు. కిలో కందిపప్పును చౌకదుకాణాల ద్వారా ప్రభుత్వం రూ.50కే ఇచ్చిం దని చంద్రబాబు పెద్ద అబద్ధం చెప్పారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఎక్కడా రూ.50కి కిలో కందిపప్పు అమ్మలేదన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీఓలోనే రూ.90కి కిలో కందిపప్పు విక్రయించాలని ఆదేశించారని, ఈ విషయం కూడా తెలుసుకోకుండా చంద్రబాబు అవాస్తవాలు మాట్లాడారని నాగిరెడ్డి విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement