చంద్రబాబు రైతు ద్రోహి
వైఎస్సార్ సీపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి
తాడేపల్లి రూరల్ : చంద్రబాబు రైతు ద్రోహి అని వైఎస్సార్ సీపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి మండిపడ్డారు. బలవంతపు భూ సేకరణకు వ్యతిరేకంగా వారం రోజుల నుంచి 25 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు జాతాల సభ్యులు పర్యటించారు. సోమవారం రాత్రి ముగింపు సందర్భంగా ఉండవల్లి సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో నాగిరెడ్డి మాట్లాడారు. ఎన్నికల ముందు రైతన్నలకు మేలు చేస్తా... నేను పెద్ద కొడుకును అవుతా... మీ కష్టాలు తీరుస్తానంటూ... చంద్రబాబు అధికారం చేజిక్కుంచుకున్నారని చెప్పారు. తీరా గెలిచిన తరువాత రైతులకు రుణమాఫీ బదులు తల్లి లాంటి భూమిని లాక్కుంటున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మొదట రాజధాని పేరుతో 23 ఎకరాలు సేకరించారని తెలిపారు.
భూ దాహం తీరనట్టు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల ఎకరాల భూమి సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులను వంచిస్తుదన్నారు. ఈ జాతాలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులే రైతులకు మద్దతు పలుకుతూ బహిరంగంగానే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేయడం గమనార్హమన్నారు. విశాఖపట్నం జిల్లా కసింకోట సర్పంచ్ బాబూరావు (టీడీపీ) భూ సమీకరణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని కేసులు పెడతామని తహశీల్దార్‌ను పంపించి బెదిరించారని తెలిపారు.
తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు న్యాయం చేసేవిధంగా పోరాడతానని బాబూరావు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఇంత తంతు జరుగుతున్నా చంద్రబాబు నాయుడు మాత్రం తన పార్టీ బలోపేతం అవుతుందని ఎమ్మెల్యేలు అందరూ తనకు మద్దతు పలుకుతున్నారంటూ వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.