ఆళ్లగడ్డ : చంద్రబాబు ప్రభుత్వం దళితులపై మరోసారి వివక్ష చూపుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నేత గంగుల బిజేంద్రారెడ్డి విమర్శించారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ శోభారాణి ఆత్మహత్య ఘటనపై సక్రమంగా స్పందించలేదన్నారు. ఈ మేరకు శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీఐటీయూ ఆధ్వర్యంలో శోభారాణి మృతదేహంతో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఆమె ఇంటి నుంచి మృతదేహాన్ని తీసుకుని పట్టణ వీధుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు.
కార్యాలయం ఎదురుగా మృతదేహాన్ని ఉంచి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గంగుల బిజేంద్రారెడ్డి మాట్లాడుతూ శోభారాణి దళిత ఉద్యోగి అయినందునే ప్రభుత్వం ఆమె ఆత్మహత్య ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కనీసం ఆమె కుటుంబాన్ని ఆ శాఖ అధికారులు ఎవరూ పరామర్శించకపోవడం దారుణమన్నారు. నిబంధనల ప్రకారం అంత్యక్రియలకు నగదు కూడా అందజేయలేదన్నారు. శోభారాణి మృతికి కారణమైన సీడీపీఓ పద్మావతిని వెంటనే విధుల నుంచి తప్పించాలని, అంతవరకు మృతదేహాన్ని ఇక్కడి నుంచి కదిలించేదిలేదని భీష్మించుకు కూర్చున్నారు.
దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో తహసీల్దార్ లక్ష్మిదేవి, ఉప తహసీల్దార్ శ్రీనివాసులు, సీఐ శ్రీనాథరెడ్డి, ఎస్సై ప్రియతంరెడ్డి ఉన్నతాధికారులతో మాట్లాడారు. సీడీపీఓను విధుల నుంచి తప్పించనున్నట్లు తెలపడంతో పాటు అంత్యక్రియలకు నగదు అందజేయడంతో నిరసన విరమించారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంపీపీ బండి చంద్రుడు, సుధాకర్‌రెడ్డి, నరసింహారెడ్డి, పత్తి నారాయణ, సింగం భరత్‌రెడ్డి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, డివిజన్ కార్యదర్శి శ్రీనివాసులు, మాలమహనాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుధాకర్, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment