
విభజించి.. తవ్వేద్దాం!
ఏజెన్సీ తెరపైకి ‘ఆ నలుగురు’
బాక్సైట్ అనుకూల బృందంలో కొత్తపల్లి గీత, గుమ్మడి సంధ్యారాణి, హైమావతి, స్వాతి
బాక్సైట్ కోసం చంద్రబాబు ఎత్తుగడ
విశాఖపట్నం: దేశాన్ని ఆక్రమించేందుకు నాడు తెల్లదొరలు ‘విభజించి...పాలించు’ అన్న కుయుక్తిని ప్రయోగిస్తే... నేడు బాక్సైట్ కొండలను కొల్లగొట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం ‘విభజించు... తవ్వేద్దాం’ అనే పన్నాగానికి తెరతీస్తోంది. గిరిజనుల మహోద్యమంతో బాక్సైట్ తవ్వకాల జీవోపై తాత్కాలికంగా ఉపసంహరించుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వెనక్కి తగ్గలేదు. ‘గిరిజనులతో సంప్రదింపులు’పేరిట కొత్త వ్యూహంతో బాక్సైట్ తవ్వకాల అంశాన్ని పరిశీలి స్తూనే ఉంది. అందుకోసం ముగ్గురు గిరిజన మహిళా ప్రజాప్రతినిధులతోపాటు మరో మాజీ మహిళా ప్రజాప్రతినిధిని ఎంపిక చేసుకోవడం గమనార్హం. అరకు ఎంపీ కొత్తపల్లి గీత, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి, విజయనగరం జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిలతోపాటు రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు శోభా హైమావతిలను ఇందుకు నియోగించాలని వ్యూహరచన చేస్తున్నారు.
ఎందుకంటే...
► వైఎస్సార్ కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలిచినప్పటికీ అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఏడాదికిపైగా అధికార టీడీపీకి సన్నిహితంగా ఉంటున్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్టు కోసం ఆమె ప్రయత్నించనున్నారు. అందుకే ఆమె బాక్సైట్ తవ్వకాల అంశంలో ప్రభుత్వ అనుకూల వాదన వినిపిస్తున్నారు.
►విజయనగరం జిల్లాకు చెందిన గిరిజన ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి. విశాఖ ఏజెన్సీకి చెందిన మాజీ మంత్రి మణికుమారికి దక్కాల్సిన ఎమ్మెల్సీ పదవిని మంత్రి నారాయణ సిఫార్సుతో చివరి నిముషంలో సంధ్యారాణికి ఇచ్చారు. ప్రస్తుతం కేబినేట్‌లో గిరిజన మంత్రి లేకపోవడంతో సంధ్యారాణి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబు ఆదేశాలతో బాక్సైట్ తవ్వకాలకు గిరిజనులను ఒప్పించే బాధ్యతను వహించేందుకు ఆమె కూడా సిద్ధపడ్డారు.
►తల్లీ కూతుళ్లు శోభా హైమావతి, స్వాతిలను కూడా చంద్రబాబు వ్యూహంలో భాగస్వాములు కానున్నారు. గిరిజన వర్గానికి చెందిన స్వాతి ప్రస్తుతం విజయనగరం జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో అరకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆమె భావిస్తున్నారు. స్వాతి తల్లి శోభా హైమావతి ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆమె 1999లో ఎస్టీ కోటా కింద ఎస్.కోట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. విశాఖ ఏజెన్సీలోని అరకు, అనంతగిరి మండలాలు అప్పటి ఎస్.కోట నియోజకవర్గంలో భాగంగా ఉండేవి. ఆమె కూడా ప్రస్తుతం నామినేటెడ్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు.
ఇలా ఈ నలుగురు మహిళా నేతలకు మరిన్ని రాజకీయ ప్రయోజనాలను ఆశగా చూపిస్తూ బాక్సైట్ తవ్వకాల అనుకూల వ్యూహానికి సాధనంగా చేసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే ఎంపీ గీత రంగంలోకి వచ్చారు. త్వరలోనే మిగిలిన ముగ్గురు నేతలు ఏజెన్సీలో అడుగుపెడతారని తెలుస్తోంది.
ఆ నలుగురూ...
సంప్రదింపుల పేరుతో గిరిజనులను బాక్సైట్ తవ్వకాల కోసం ఒప్పించేందుకు చంద్రబాబు ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది. విశాఖ ఏజెన్సీకి చెందిన మాజీ మంత్రి మణికుమారితోపాటు ఇతర గిరిజన నేతలు కూడా బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించారు. దాంతో ఇతర జిల్లాలకు చెందిన గిరిజన నేతల ద్వారా కథ నడిపించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అరకు ఎంపీ కొత్తపల్లి గీత, ఎమ్మెల్సీ సంధ్యారాణి, విజయనగరం జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతి, టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతిలను ఇందుకు నియోగించాలని ప్రణాళిక రూపొందించారు. అందుకే ఆ నలుగురు బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా మాట్లాడకుండా మౌనం వహిస్తున్నారు. గతవారం విశాఖపట్నం గిరిజన భవన్‌లో నిర్వహించిన సదస్సుకు కూడా హాజరుకాలేదు.