
చంద్రబాబుకు చిర్రెత్తుకొచ్చిన వేళ!
చిత్తూరు: అసలే ఆయనకు కోపం ఎక్కువ. పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. పడిపోయే పార్టీని నిలబెట్టడానికి నానా కష్టాలు పడుతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు కార్మికులు వచ్చి సమస్యలు చెబుతామన్నారు. దాంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు సొంత జిల్లా కుప్పం పర్యటనలో ఉండగా, కలిసేందుకు వచ్చిన అల్యూమినియం కార్మికులపై ఆయన మండిపడ్డారు. యూనియన్లతో సమస్యలు పరిష్కారం కావని వాటితో సంబంధం లేకుండా తన వద్దకు రావాలని చెప్పారు. యూనియన్లతో తన వద్దకు రావద్దని కూడా హెచ్చరించారు. చంద్రబాబు వైఖరి చూసి కార్మికులు విస్తుపోయారు. ఆయన మారలేదు.. ఇక మారబోరని నియోజకవర్గ ప్రజలే చెబుతున్నారు. ఎందుకంటే ఆయన అప్పటి మాటలనే ఇప్పటికీ వల్లిస్తున్నారు.
నేను మారాను, నేను మారాను అని చెప్పుకునే చంద్రబాబు మారలేదని ఈ సంఘటనతో ప్రజలకు అర్థమైపోయింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యూనియన్లను వ్యతిరేకించారు. యూనియన్లు ఉంటే పరిశ్రమలు రావన్నారు. అంతేనా ఆర్ట్స్ సబ్జక్ట్‌లు దండగన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో..... ఇప్పుడు కుప్పం పర్యటనలో ఉన్న బాబు యూనియన్లు పెట్టుకోవడమే సమస్య అంటూ తన వద్దకు వచ్చిన కార్మికులకు క్లాస్ పీకి పంపించారు.
మీ పిల్లలను రాజకీయాల్లోకి రానివ్వకండి, బాగా చదివించాలని తన వద్దకు వచ్చిన మహిళలకు చంద్రబాబు చెబుతున్నారు. ఆయన తన పర్యటనలో తమ బాధలు చెప్పుకోవడానికి వచ్చిన మహిళల గోడు కూడా వినడంలేదు. తొమ్మిదేళ్లు రాష్ట్రంలో, కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే బాబు తన సొంత నియోజకవర్గంలో సమస్యలు వినడానికే ఆసక్తి చూపడంలేదు. ఇక తమ సమస్యలు ఆయన ఏమి పరిష్కరిస్తారని ప్రజలు అంటున్నారు. ప్రతిపక్ష నాయకుడి సొంత నియోజకవర్గం పర్యటన పరిస్థితి ఇది. రెండు కళ్లు, రెండు నాలుకలతో రాష్ట్రవ్యాప్తంగా విమర్శల పాలయిన చంద్రబాబు ఇప్పుడు సొంత నియోజకవర్గంలోనూ ప్రజలకు దూరమవుతున్నారు.