రైతు నెత్తిన వడ్డీ భారం | Chandrababu Naidu Cheating Farmers On Loan Waiver | Sakshi
Sakshi News home page

రైతు నెత్తిన వడ్డీ భారం

Published Thu, Jul 10 2014 12:46 AM | Last Updated on Sat, Sep 2 2017 10:03 AM

రైతు నెత్తిన వడ్డీ భారం

రైతు నెత్తిన వడ్డీ భారం

పెరవలి:రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ విషయూన్ని ఏటూ తేల్చకపోవడంతో రైతులకు అసలుకే మోసం వస్తోంది. వడ్డీలేని రుణాలు తీసుకున్న అన్నదాత లకు ఇప్పుడు ఆ మొత్తాలపై 7 శాతం వడ్డీ చెల్లించాల్సిన దుస్థితి దాపురించింది. దీర్ఘకాలిక (ఎల్‌టీ) రుణాలపై 16 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. వ్యవసాయ రుణాలను మాఫీ చేయకపోవడం వల్ల రైతులు రాయితీ కోల్పోవడంతోపాటు తీసుకున్న మొత్తంపై వడ్డీతోపాటు అపరాధ వడ్డీ, ఇతర చార్జీలు చెల్లించక తప్పదని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు అందుతున్న నోటీసులు రైతుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిం చాయి. రైతులంతా బ్యాంకర్లను నిలదీయడంతో నోటీసులు ఇవ్వడాన్ని తాత్కాలికంగా నిలిపివేసి రైతుల సెల్‌ఫోన్లకు మెసేజిలు పంపిస్తున్నారు.
 
 హడలిపోతున్న అన్నదాతలు
 వ్యవసాయ రుణాలకు సంబంధించి వడ్డీలు, ఇతర చార్జీలతో కలిపి ఎంతకట్టాలనే విషయూన్ని తెలుసుకుంటున్న రైతులు హడలి పోతున్నారు. జిల్లాలో వ్యవసాయ అవసరాల కోసం సుమారు 14లక్షల మంది రైతులు రుణాలు తీసుకున్నారు. వీరిలో సుమారు 5లక్షల మంది పంట రుణాలు (క్రాప్ లోన్లు) తీసుకోగా, మరో 3 లక్షల మంది దీర్ఘకాలిక (ఎల్టీ) రుణాలు పొందారు. మిగిలిన 6 లక్షల మంది బంగార నగలను తనఖాపెట్టి రుణాలు తీసుకున్నారు. ప్రభుత్వం పూటకో ప్రకటన.. రోజుకో శ్వేతపత్రం విడుదల చేస్తూ రైతులను అయోమయంలోకి నెట్టేస్తోంది. ఈ పరిస్థితుల్లో పాత రుణాలు కట్టలేక.. కొత్త రుణాలు దక్కక రైతులు అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నారు.
 
 రుణమాఫీ సంగతి దేవుడెరుగు ఇప్పటివరకు ప్రభుత్వం ఇస్తున్న వడ్డీ రాయితీ కూడా కోల్పోవాల్సి రావడంతో గగ్గోలు పెడుతున్నారు. వడ్డీలేని వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులు ఆ మొత్తాలను గడచిన మే 1వ తేదీలోపు చెల్లించాల్సి ఉంది. రుణమాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పడంతో నేటికీ ఆ మొత్తాలను చెల్లించలేకపోయూరు. వారంతా ఇప్పుడు 7.50 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉందని బ్యాంకుల నుంచి నోటీసులు, మెసేజిలు వస్తున్నాయి. రుణం తీసుకున్న ఏడాదిలోపు ఆ మొత్తాన్ని చెల్లిస్తే 6 శాతం వడ్డీ రాయితీ లభించేది. దీనివల్ల రైతులు తీసుకున్న అప్పు మొత్తం చెల్లిస్తే సరిపోయేది. అలా చేయకపోవడంతో 7.50 శాతం వడ్డీతోపాటు నోటీసు ఖర్చులు, ఈపీ (జప్తు నోటీసు) ఖర్చుల రూపంలో వెరుు్యకి రూ.10 చొప్పున అదనంగా చెల్లించాల్సి వస్తోంది.
 
 రైతులపై ఇప్పటికిప్పుడు రూ.175.40 కోట్ల భారం
 జిల్లాలో డీసీసీబీ, సహకార సంఘాల ద్వారా రూ.1,030.84 కోట్లను వ్యవసాయ రుణాలుగా ఇవ్వగా, వాణిజ్య బ్యాంకులు రూ.600 కోట్ల మేర రుణాలిచ్చాయి. మరోవైపు సహకార సంఘాల ద్వారా గేదెలు, మోటార్ సైకిళ్లు, ట్రాక్టర్లు వంటివి కొనుగోలు చేసేందుకు రైతులు తీసుకున్న దీర్ఘకాలిక (ఎల్‌టీ) రుణాలు జిల్లాలో రూ.360.98 కోట్ల మేర ఉన్నాయి. ఈ మొత్తాలను ఇప్పటికిప్పుడు చెల్లిస్తే వడ్డీ, అపరాధ రుసుం రూపంలో జిల్లా రైతులు కనీసం రూ.175.40 కోట్ల అదనపు భారం మోయూల్సి వస్తుందని అంచనా. దీనికి నోటీసు ఖర్చులు, జప్తు నోటీసు ఖర్చులు అదనం.
 
 వడ్డీతో కట్టాలని నోటీస్ వచ్చింది
 వ్యవసాయ పెట్టుబడుల కోసం సొసైటీలో లోన్ తీసుకున్నాను. ఏటా సకాలంలో కట్టేవాణ్ణి. దీనివల్ల వడ్డీ భారం ఉండేది కాదు. రుణమాఫీ చేస్తారనే ఉద్దేశంతో ఈ ఏడాది రుణం కట్టకుండా మానేశాను. ఇప్పుడు 7.50 శాతం వడ్డీతో అప్పు మొత్తం కట్టాలని బ్యాంకు నుంచి నోటీసులు ఇస్తున్నారు. ఇప్పుడేం చేయూలో అర్థం కావడం లేదు. చంద్రబాబును నమ్మడం వల్ల వడ్డీలేని రుణానికి ఇప్పుడు వడ్డీ కట్టాల్సి వస్తోంది.
 - యాండ్ర నరసింహమూర్తి, రైతు, కడింపాడు
 
 గోరుచుట్టుపై రోకలి పోటులా...
 గత ఏడాది సొసైటీలో రూ.లక్ష రుణం తీసుకున్నాను. రుణమాఫీ చేస్తే అప్పులు తీరతాయని ఆశపడ్డాను. కానీ మాఫీ కాలేదు. వెంటనే అప్పు మొత్తం వడ్డీతో కలిపి కట్టాలని బ్యాంకు అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ఈసారి వడ్డీ రారుుతీ ఉండదని, అపరాధ వడ్డీతో కలిపి రుణం మొత్తం కట్టాలంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. కొత్త అప్పు పుట్టడం లేదు. పాత అప్పు తీర్చే పరిస్థితి కనిపించడం లేదు.
 - మద్దిపాటి సత్యం, రైతు, ముక్కామల
 
 సబ్సిడీ పోయి వడ్డీ తగిలింది
 చంద్రబాబు మాట నమ్మి రుణం కట్టలేదు. ఎల్టీ రుణంగా రూ.లక్ష తీసుకున్నాను. ఏటా వాయిదా కట్టేవాణ్ణి. మాఫీ అవుతుం దనే ధీమాతో రుణం కట్టకపోవడంతో ఇప్పుడు వడ్డీతోపాటు ఈ రుణంపై ఇచ్చే సబ్సిడీ కూడా పోయే పరిస్థితి వచ్చింది. ఎన్నికల సమయంలో ఓట్లకోసం మమ్మల్ని నమ్మించి మోసం చేశారు. అసలుతోపాటు సబ్సిడీ కూడా పోరుు వడ్డీ తగిలిందన్నట్టుగా ఉంది మా పరిస్థితి. ఏం చేయాలో తెలియడం లేదు.
 -గండేపల్లి రామకృష్ణ, రైతు, ముక్కామల
 
 నమ్మక ద్రోహం చేస్తారనుకోలేదు
 మూడేళ్లుగా వరదలు, తుపాన్లతో పంటలు కోల్పోయాను. బ్యాంకులో రూ.లక్ష రుణం తీసుకున్నాను. మాఫీ అవుతుం దనే నమ్మకంతో ఉన్నాను. పరిస్థితుల్ని చూస్తుంటే రుణం మాఫీ అయ్యేలా లేదు. కొత్త అప్పు పుట్టడం లేదు. పంటలు వేయడానికి చేతిలో దమ్మిడీ కూడా లేక అవస్థలు పడుతున్నాం. మాయమాటలకు మోసపోయామని అనిపిస్తోంది. ఇంత నమ్మక ద్రోహం చేస్తారని కలలో కూడా ఊహించలేదు.
 -పులపర్తి సూర్యనారాయణ, రైతు, అన్నవరప్పాడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement