
వాళ్లు చేస్తే తప్పు... తాను చేస్తే ఒప్పు...
♦ చంద్రబాబు రెండు నాల్కల ధోరణి
♦ సీఎం తీరుపై విమర్శల వెల్లువ
సాక్షి, అమరావతి: ‘‘తలసాని శ్రీనివాస యాదవ్ ఏ పార్టీలో గెలిచాడు? ఏ పార్టీలో మంత్రిగా ఉన్నాడో ఆయన సమాధానం చెప్పాలి. తెలుగుదేశంలో పోటీచేసి గెలిచి, కనీసం రాజీనామా చేయకుండా హీరో మాదిరిగా మనల్ని తిడుతూ వేరేపార్టీలో మంత్రిగా ఉన్నాడంటే ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా? తమ్ముళ్లూ అని అడుగుతున్నా! ఇది న్యాయమా! ప్రజలకు ఆమోదమా?’’
‘‘మా ఎమ్మెల్యేని ఎన్నికలకు ముందు మీ ఫామ్ హౌస్‌కు తీసుకుపోయి డబ్బులిచ్చి ఏమాత్రం సిగ్గుపడకుండా పోలీసు ప్రొటక్షన్‌తో తీసుకువెళ్లిన నీకు (కేసీఆర్‌కు) నీతి గుర్తుకు రాలేదా? అని అడుగుతున్నా. నాకు ఒక ఎమ్మెల్సీ పదవి ముఖ్యం కాదు సిద్ధాంతం ముఖ్యం. నీతి ముఖ్యం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి.’’
.... జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా, కూకట్‌పల్లి ఎమ్మెల్యే పార్టీ మారిన సందర్భంలో చంద్రబాబు మాటలివి. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన వారికి మంత్రి పదవి ఇస్తే తప్పుగా, రాజకీయ వ్యభిచారంగా ఆయన అభివర్ణించారు. తమపార్టీ ఎమ్మెల్యేలను సంతలో సరుకుల్లా కొన్నారని, దమ్ముంటే రాజీనామా చేయించి పోటీ చేయాలని సవాళ్లు విసిరారు. ఇప్పుడా మాటలన్నీ మరచి తానే రాజకీయ వ్యభిచారం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వైఎస్సార్‌సీపీ గుర్తుపై గెలుపొందిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడమే కాకుండా, వారితో రాజీనామా చేయించకుండానే నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టడంపై మేధావులు, రాజకీయ నిపుణులు మొదలు సామాన్య ప్రజలు సైతం విమర్శిస్తున్నారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం, రెండు నాల్కల ధోరణి మరోసారి రుజువైందని వ్యాఖ్యానిస్తున్నారు.
తెలంగాణలో తప్పన్నదే ఏపీలో ఒప్పుగా భావించడం ఆయన ధోరణికి నిదర్శనమని దుయ్యబడుతున్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు మంత్రి పదవులు కట్టబెట్టడంపై చంద్రబాబు చేసిన తీవ్ర దూషణలను ప్రజలు గుర్తు చేస్తున్నారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే పార్టీ మారిన సందర్భంలోనూ కేసీఆర్‌పై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో సత్యహరిశ్చంద్రుడి మాదిరిగా మాట్లాడిన చంద్రబాబు ఇపుడు ఏపీలో తాను స్వయంగా చేస్తున్న ఫిరాయింపుల అరాచక పరాకాష్ట చర్యలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణలో తలసాని శ్రీనివాస యాదవ్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నప్పుడు రాజ్యాంగం విలువలు, సిద్ధాంతాలు, నీతి నియామాలంటూ గగ్గోలు పెట్టిన చంద్రబాబు ఇప్పుడు వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచిన ఆదినారాయణరెడ్డి, భూమా అఖిలప్రియ, అమర్‌నాధ్‌రెడ్డి, సుజయకృష్ణ రంగారావులకు ఏపీ కేబినెట్లో చోటుకల్పించడంపై ఏం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. విపక్షం, రాజకీయ నిపుణులే కాకుండా సొంతపార్టీ వారినుంచి కూడా బాబు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.