బాబుకు రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదు: జ్యోతుల నెహ్రూ
వైఎస్సార్‌సీపీఎల్పీ ఉపనేత జ్యోతుల నెహ్రూ
సాక్షి, హైదరాబాద్: రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పిన ఏపీ సీఎం చంద్రబాబుకు రాష్ట్రాన్ని పాలించే హక్కు ఎంత మా త్రం లేదని, ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం ఉపనేత జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాల యంలో ఆయన మాట్లాడుతూ తొలుత చెప్పిన విధంగా రూ. 87 వేల కోట్ల వ్యవసాయ రుణాలతోపాటు, డ్వాక్రాలోని ప్రతి మహిళ రుణం పూర్తిగా మాఫీ చేసిననాడే ఆయనకు పదవిలో కొనసాగే అర్హత ఉంటుందన్నారు.
వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని తొలుత చెప్పిన చంద్రబాబు క్రమంగా వాటిని కుదించుకుంటూ వచ్చారని దుయ్యబట్టారు. రుణ మాఫీకి సంబంధించి జారీ చేసిన పత్రాల్లో ఒక రైతుకు రూ.3.15లు మాత్రమే మాఫీ అయితే మరో రైతుకు కేవలం రూ.95లు మాత్రమే రద్దయ్యాయని చెప్పారు. ఇంకొక రైతు రూ.60 వేల రుణం తీసుకుంటే అందులో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రూ.13 వేలు రద్దుకు మాత్రమే అర్హత ఉందని తేలుస్తూ, అది కూడా ఐదు విడతలుగా మాఫీ చేస్తామనడం విచిత్రమని వ్యాఖ్యానించారు.