
సాక్షి, అమరావతి : ప్రత్యేక హోదా నినాదాలతో రాష్ట్రం హోరెత్తుతోంది. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని ఉధృతం చేసింది. గురువారం అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే వెంకట్ రెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు, ఇంఛార్జ్‌లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ...ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పలేదని, తన లేఖకు ఆర్థిక సంఘం చైర్మన్ స్వయంగా సమాధానం ఇచ్చారన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. హోదాతో ఆర్థిక సంఘానికి సంబంధం లేదని, అది కేంద్రం నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెప్పారని, చంద్రబాబు అదే ఆర్థిక సంఘాన్ని బూచిగా చూపి తప్పించుకుంటున్నారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదని చంద్రబాబు చెబుతున్నారని, కానీ ఇప్పటికే ఉన్న రాష్ట్రాలకు కేంద్రం హోదాను పొడిగించిందని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కేసుల భయంతోనే చంద్రబాబు హోదాపై ముఖం చాటేశారని, హోదాతో పాటు విభజన హామీల అమలుకు వైఎస్‌ఆర్ సీపీ పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్ వేదికగా ఆందోళన చేస్తామని, 21న కేంద్రంపై అవిశ్వాసం పెడతామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అప్పటికీ దిగిరాకుంటే ఏప్రిల్ 6న ఎంపీలం రాజీనామా చేస్తామని ఆయన అన్నారు.
మాకు అలాంటి భయాల్లేవు: పెద్దిరెడ్డి
విభజన సమయంలో రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరూ చిత్తూరు జిల్లా వాసులేనని వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రం కష్టాల్లో ఉంటే లక్షలకోట్ల పెట్టుబడులు, వేల ఉద్యోగాలు వచ్చాయని చంద్రబాబు అంటున్నారన్నారు. ప్యాకేజీ అయితే బాగా దండుకోవచ్చని చంద్రబాబు ఆలోచన అని ఆయన మండిపడ్డారు. ప్రజలు మాత్రం ప్రత్యేక హోదానే కోరుకుంటున్నారని...హోదానే ఏపీకి సంజీవని అని ...ఆ విషయం తెలిసినా చంద్రబాబు మాట్లాడరని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. మాట్లాడితే కేసులు పెడతారేమో అని చంద్రబాబు భయపడుతున్నారన్నారు. తమకు అలాంటి భయాలు లేవని, వైఎస్ జగన్ నేతృత్వంలో పోరాటం సాగిస్తామని పెద్దిరెడ్డి తెలిపారు.
చంద్రబాబు భయం అదే: మేకపాటి
ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని వైఎస్‌ఆర్ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం హోదా వద్దు...ప్యాకేజీ అంటున్నారని ఆయన విమర్శించారు. ఓటుకు కోట్లు కేసు చంద్రబాబును వెంటాడుతోందని, అందుకే కేంద్రానికి భయపడుతున్నారని మేకపాటి వ్యాఖ్యానించారు.