వైఎస్ఆర్‌సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల ఆందోళన పార్లమెంట్‌లో కొనసాగుతుందని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. బీఏసీ సమావేశానికి వైఎస్ఆర్‌సీపీ తరఫున హాజరయ్యానని, ఏపీకి ప్రత్యేక మోదా కోసం మొదటి నుంచి ఆందోళన చేస్తున్నామని స్పీకర్‌కు తెలియజేసినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న తాము అవిశ్వాస తీర్మానం కోసం నోటీస్ ఇచ్చామని, రేపు చర్చ చేపట్టాలని కోరినట్లు వెల్లడించారు. గత ప్రధాని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరగా స్పీకర్ ఏమీ మాట్లాడలేదన్నారు. హోదా కోసం మా ధర్మాన్ని మేం సరిగ్గానే నిర్వహిస్తున్నా.. అవిశ్వాసం పెడితే మద్దతు కూడగడతామన్న వ్యక్తి పవన్ కల్యాణ్ ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంపై రేపే (శుక్రవారం) అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నోటీసులు అందజేసిన విషయం తెలిసిందే.
కాగా, అవిశ్వాస తీర్మానంలో తమకు సహకరించాలని ఇతర పార్టీ నేతలను కలుసుకుని వైఎస్ఆర్ సీపీ ఎంపీలు మద్దతు కూడగడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవిశ్వాస తీర్మానం ఇచ్చామని వైఎస్ఆర్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కాంగ్రెస్, సీపీఎం, అన్నాడీఎంకే, టీడీపీ, టీఆర్ఎస్, ఆప్ తదితర పార్టీలను కలిసి అవిశ్వాసంపై మద్దతు తెలపాలని కోరినట్లు వెల్లడించారు. ఏపీ ప్రజల ప్రయోజనాలను కాపాడడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. మేం అయిదుగురు ఎంపీలమే ఉన్నా, అయిదుకోట్ల ప్రజల గొంతుక వినిపిస్తున్నామని సుబ్బారెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment