వారేం పీకారు? | Chandrababu naidu improper comments on oppositions | Sakshi
Sakshi News home page

వారేం పీకారు?

Published Fri, May 11 2018 2:56 AM | Last Updated on Fri, May 11 2018 2:56 AM

Chandrababu naidu improper comments on oppositions - Sakshi

సాక్షి ప్రతినిధి, కర్నూలు: ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. తీవ్ర పదజాలాన్ని ఉపయోగించారు. కర్నూలు జిల్లాలో అభివృద్ధి జరగడం లేదని, కేవలం శంకుస్థాపనలు చేసి చేతులు దులుపుకుంటున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ఆయన స్పందిస్తూ.. గతంలో వారు(ప్రతిపక్షాలు) ఏం పీకారని ప్రశ్నించారు.

పెళ్లయిన వెంటనే పిల్లలు పుట్టరని, ఏడాది సమయం పడుతుందని అన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు కూడా సమయం పడుతుందని చెప్పుకొచ్చారు. గతంలో ఎప్పుడూ లేనన్ని పరిశ్రమలు ఇప్పుడు కర్నూలు జిల్లాకు వస్తున్నాయని, ఈ అభివృద్ధి కనిపించడం లేదా? అని మండిపడ్డారు. వాళ్లు (ప్రతిపక్షాలు) ఏం మాట్లాడితే అదే మీరు మాట్లాడితే ఎలా? అంటూ విలేకరులను ఎదురు ప్రశ్నించారు.

అందరూ నాకు మద్దతివ్వాలి
కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలోని గుట్టపాడు గ్రామం వద్ద 0.7 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో రూ.3,000 కోట్ల పెట్టుబడితో జైరాజ్‌ ఇస్పాత్‌ సంస్థ నెలకొల్పనున్న ఉక్కు పరిశ్రమ, అబ్దుల్‌ హఖ్‌ ఉర్దూ యూనివర్సిటీ భవనాలు, క్లస్టర్‌ యూనివర్సిటీకి సీఎం చంద్రబాబు గురువారం శంకుస్థాపన చేశారు.

కర్నూలు జిల్లాను శ్రీసిటీ తరహాలో పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులతో నిమిషంపాటు చంద్రబాబు మాట్లాడారు. జర్నలిస్టులకు త్రిబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పథకాన్ని వర్తింపజేయాలని కోరగా... తర్వాత చేస్తామని బదులిచ్చారు. అనంతరం ఓర్వకల్లులో బహిరంగ సభ, కర్నూలులో మేధావులతో ప్రత్యేక హోదాపై ముఖాముఖి నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను పోరాడుతున్నానని, అందరూ తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.  

ఢిల్లీలో నన్నెవరూ పట్టించుకోలేదు  
కర్ణాటక ఎన్నికల్లో ఫలానా పార్టీకి ఓటు వేయాలని తాను ఎన్నడూ చెప్పలేదని చంద్రబాబు పేర్కొన్నారు. కేవలం మనకు అన్యాయం చేసిన వారిని ఓడించాలని మాత్రమే కోరానని వివరించారు. రాష్ట్రాభివృద్ధి కోసం 29 సార్లు ఢిల్లీకి వెళ్లానని, అక్కడ తనను కనీసం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో బీజేపీకి ఒక్క ఓటు కూడా లేదని తేల్చిచెప్పారు. ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి 25 ఎంపీ సీట్లు ఇవ్వాలని ప్రజలను కోరారు. పోలవరం ప్రాజెక్టు పనులు 53 శాతం పూర్తయ్యాయని, కేంద్ర ప్రభుత్వం రూ.3,000 కోట్ల నిధులు ఇవ్వాల్సి ఉందని తెలిపారు.

రాష్ట్రంలో కేంద్ర విద్యా సంస్థల పనులేవీ ప్రారంభం కాలేదన్నారు. రాయలసీమలో ఎవరూ చేయని విధంగా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి కాలేజీలో వైఫై సౌకర్యం కల్పిస్తామని, ప్రతి పాఠశాలలో డిజిటల్‌ తరగతులను ప్రవేశపెడుతున్నామని వెల్లడించారు. త్వరలోనే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రులు భూమా అఖిలప్రియ, కాలువ శ్రీనివాసులు, అమర్‌నాథ్‌రెడ్డి, ఎంపీలు టీజీ వెంకటేశ్, బుట్టా రేణుక, ఎస్పీవై రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement