స్వగ్రామంలో సీఎం సంబరాలు
ఉప ఎన్నికల కోడ్ నేపథ్యంలో ముక్తసరి ప్రసంగం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన స్వగ్రామం నారావారి పల్లెలో బుధవారం సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. భోగి పండుగ సందర్భంగా ఉదయం 11.30 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చిన బాబు.. దివంగత సీఎం ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత చంద్రబాబు తల్లిదండ్రులు.. అమ్మణ్ణమ్మ, ఖర్జూర నాయుడు సమాధులకు పుష్పాంజలి ఘటించారు. సాయంత్రం 5 గంటలకు ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. తిరుపతి ఉప ఎన్నిక కోడ్ అమల్లో ఉండడం వల్ల తాను ఏమీ మాట్లాడలేనని పేర్కొంటూ సీఎం ముక్తసరిగా ప్రసంగించారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు ప్రజల జీవితాల్లో ఈ సంక్రాం తి.. సరికొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నానన్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సీఎంతో ముచ్చటించారు. సంబరాల్లో పాల్గొన్న విద్యుత్ కార్మికుల విశ్రాంత సంఘం నేతలు తమ సంఘం తరఫున రూ.1.11 కోట్ల డీడీని హుద్ హుద్ తుపాను బాధితుల సాయం కోసం సీఎంకి అందజేశారు.
తిరుపతి టీడీపీ అభ్యర్థిగా సుగుణమ్మ
టీడీపీ ఎమ్మెల్యే వెంకటరమణ మృతితో ఖాళీ అయిన తిరుపతి అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూలు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి చిత్తూరు జిల్లా టీడీపీ కన్వీనర్ గౌనివారి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ భార్య ఎం. సుగుణమ్మ, జెడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి, ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యేలతో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తిరుపతి ఉప ఎన్నిక, జిల్లాలో టీడీపీ పరిస్థితిపై వారితో సమీక్షించారు. దివంగత వెంకటరమణ భార్య సుగుణమ్మనే ఉప ఎన్నిక బరిలో అభ్యర్థిగా దించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. అనంతరం తిరుపతి టీడీపీ అభ్యర్థి ఎం. సుగుణమ్మ విలేకరులతో మాట్లాడుతూ.. తన భర్త దివంగత వెంకటరమణ ఆశయాలకోసం పనిచేస్తానన్నారు. ఉప ఎన్నికలో తనకు సహకరించాలని, అన్ని పార్టీలను కోరనున్నట్లు తెలిపారు.
నేడు మంత్రి బొజ్జలకు సీఎం పరామర్శ
ఇటీవల పితృ వియోగం చెందిన రాష్ర్ట మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డిని సీఎం పరామర్శిం చనున్నారు. గురువారం ఉదయం 8 గంటలకు నారావారి పల్లె నుంచి హెలీ కాప్టర్‌లో బయలుదేరి మంత్రి బొజ్జల స్వగ్రామమైన శ్రీకాళహస్తి మండలంలోని ఊరందూరుకు చంద్రబాబు చేరుకుంటారు. కొద్దిసేపు బొజ్జలను పరామర్శించనున్నారు. అనంతరం, అదే హెలీకాప్టర్‌లో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని, బెంగళూరు మీదుగా ఢిల్లీకి వెళ్లనున్నారు.