
నిజం పలికిన చంద్రబాబు : ఎమ్మెల్యే శ్రీకాంత్
హైదరాబాద్: అసలు నిజాలనే పలకని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు మొదటిసారిగా సీమాంధ్రలో వైఎస్ఆర్ సీపీకి 22 నుంచి 25 ఎంపీ సీట్లొస్తాయని నిజం పలికాడని ఆ పార్టీ రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీ వ్యతిరేక ఓట్లే వైఎస్ఆర్ సీపీకి వస్తాయన్నారు. అంతేగానీ, సోనియా గాంధీతో కుమ్మక్కై కాదని చెప్పారు. చంద్రబాబు చేసిన తప్పిదాలు ఎవరూ చేసి ఉండరన్నారు.
చంద్రబాబు మానసిక పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతుందన్నారు. అతని కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు చంద్రబాబుకు హితవు చెప్పాలన్నారు. ఢిల్లీలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు తాకట్టుపెట్టారని బాధపడ్డారు. చిత్తశుద్ధిలేని బాబుకి ఎవరిపైనా ఆరోపణలు చేసే అర్హత లేదని చెప్పారు. 6 కోట్ల మంది చేస్తున్న దీక్షను పట్టించుకోకుండా విభజనను త్వరగా పూర్తిచేయమని కోరుతున్నారు.