తాడేపల్లి: ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆందోళనలు ప్రజలు గురించి కాదనీ, తన బినామీల కోసమేనని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న హడావుడి అంతా అవినీతి ఆస్తులను కాపాడుకోవడం కోసమేనని ఆరోపించారు. గత ఐదేళ్లలో రైతులకు ఎటువంటి మేలు చేయని చంద్రబాబు.. ముందు రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల ఉసురు తగిలే గత ఎన్నికల్లో చంద్రబాబు ఘోర ఓటమి చెందారని, భ్రమరావతి ముసుగులో రైతులతో కృత్రిమ ఉద్యమం సృష్టించారన్నారు. బినామీల కోసం ఆరాట పడుతున్న చంద్రబాబును ప్రజలు క్షమించరన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల తరహాలోనే చంద్రబాబు వ్యవహరించడమే ఆయన మోసాలకు నిదర్శనమన్నారు. గతంలో ఈ-ఇటుక పేరుతో చంద్రబాబు చేసిన వసూళ్లకు లెక్కలు లేవని, ఇప్పుడ మరో జోలె పడుతున్నారంటూ శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
‘చంద్రబాబు నివాసము ఉన్న కరకట్ట వద్దకు వెళ్లి రైతులు నిలదీయాలి. గత ఐదేళ్లలో చంద్రబాబు రైతుల్ని మోసం చేశారు. 4వేల 70 ఎకరాలు ఇన్ సైడర్ కు పాల్పడినట్లు మంత్రివర్గ ఉపసంఘం నిర్ధారించింది.ఇన్ సైడర్ అక్రమాలు వెలుగుచూశాయి కాబట్టే చంద్రబాబు ఆందోళన చేపట్టారు. ప్రాంతాలు వారీగా వివాదాలు సృష్టించి అల్లకల్లోలం సృష్టించాలని చంద్రబాబు చూస్తున్నారు. 23 మంది ఎమ్మెల్యేలు చేత రాజీనామా చేయించి ముందుకు రావాలి. పక్క రాష్ట్రాలు మధ్య సత్సంబంధాలు ఉండాలని చూస్తుంటే మీరు వక్ర భాష్యం చేస్తున్నారు.తెలంగాణా రాష్ట్రంలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అభివృద్ధి పథంలో కనిపిస్తుంటే.. గత ఐదేళ్లలో ఏపీ లో ఏమి చేశారు. రాయలసీమ వాసులు చేసిన త్యాగాలు మీకు గుర్తుకు రావడం లేదు. శ్రీశైలం 82 వేల ఎకరాలు రైతులు ఆనాడు త్యాగం చేశారు. ఈ ప్రాంతం సస్య శ్యామలం చేసిన ఘనత సీమ వాసులది. ప్రాంతాలు మధ్య విభేదాలు సృష్టించడం చంద్రబాబు నైజం. ఒక్కో ప్రాంతంలో ఒకోతరహలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. సమగ్రమైన అభివృద్ధి జరగాలని సీఎం జగన్ పాలన చేస్తున్నారు.. ఏడు నెలలు పాలనలో ఏ ఒక్క అవినీతి జరగలేదు.పోలవరం ప్రాజెక్టు వచ్చే ఏడాదికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మా పాలనలో పూర్తి చేస్తాం. గోదావరి జలాలతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం’ అని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment