మంత్రికి వడ్డాణం గిప్ట్, బాబు సీరియస్!
హైదరాబాద్ : దాదాపు ముప్పై ఏడున్నర లక్షల విలువైన ఓ వడ్డాణం...ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో సంచలనం రేపుతోంది. ఓ మహిళా మంత్రికి గ్రానైట్ వ్యాపారులు బంగారు వడ్డాణం గిప్ట్గా ఇచ్చినట్టు వచ్చిన వార్త....సచివాలయంలో టాక్ ఆఫ్ టుడేగా మారిపోయింది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మహిళా మంత్రిని పిలిచి వివరణ అడిగినట్లు సమాచారం.
వివరాల్లోకి వెళితే రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాతకు ఇటీవలే ప్రకాశం జిల్లా గ్రానైట్ వ్యాపారులు సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు ఆమెకు సుమారు రూ.37 లక్షల విలువైన బంగారు వడ్డాణం కానుకగా ఇచ్చినట్లు విస్తృతంగా చర్చ జరుగుతోంది. అదే జిల్లాకు చెందిన మరో మంత్రి సోదరుడు...దగ్గరుండి ఈ తతంగాన్ని నడిపించినట్లు సమాచారం.
అయితే ఈ ఆరోపణలను మంత్రి పీతల సుజాత తీవ్రంగా ఖండించారు. తాను ఎవరి దగ్గరా బహుమతులు తీసుకోలేదని....ఆ వడ్డాణం కథతో తనకెలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. ఇదంతా తనపై సాగుతున్న దుష్ప్రచారమని పీతల సుజాత ఆరోపించారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు తనను ఎలాంటి వివరణ కోరలేదని ఆమె తెలిపారు. తనకు గ్రానైట్ వ్యాపారులు సన్మానం చేసిన మాట వాస్తవమేనని అయితే వారు తనకు ఎలాంటి గిప్ట్లు ఇవ్వలేదన్నారు.