రేవంత్ కేసునుంచి బాబు తప్పించుకోలేరు
గుంటూరు: ఓటుకు కోట్లు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర పరువు తీశారని వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, దేశ ప్రధాని నరేంద్రమోదీ కాళ్లు పట్టుకొనైనా ఈ కేసు నుంచి చంద్రబాబు బయటపడాలని చూస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎమ్మెల్సీగా ఎన్నికైన నేపథ్యంలో ఆయనకు అభినందన సభ ఏర్పాటుచేశారు. ఇందులో బొత్స ఇతర వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వాసిరెడ్డి పద్మతో కలిసి మాట్లాడారు. రాజకీయాలను వ్యాపారం చేసిన ఘనత చంద్రబాబుదేనని ఎద్దేవా చేశారు.
మత్తయ్యకు చంద్రబాబు ఆశ్రయం కల్పించడం సిగ్గు చేటు అని అంబటి రాంబాబు విమర్శించారు. సెక్షన్ 8 గురించి ఇంతకాలం పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారని అంబటి మండిపడ్డారు. ఇక ఉమ్మారెడ్డి మాట్లాడుతూ రేవంత్ వ్యవహారం చూసిన తర్వాత కూడా చంద్రబాబు బుద్ధి మారడం లేదని అన్నారు. బలం లేకున్నా ప్రకాశం కర్నూలు జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను చంద్రబాబు బరిలోకి దింపారని ఆరోపించారు. ఓట్లను కొనుగోలు చేయాలనే దుర్భుద్దితోనే చంద్రబాబు ఇలాంటి పనులు చేస్తున్నారని అన్నారు. ఇక వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కేసు నుంచి చంద్రబాబు ఏమాత్రం తప్పించుకోలేరని అన్నారు. డబ్బుతో ఓట్లు కొనుగోలు చేస్తూ పట్టుబడిన వ్యక్తి సీఎంగా ఉండటం దురదృష్టకరమని చెప్పారు.