హోదాపై చంద్రబాబు నాటకాలు
పట్నంబజారు(గుంటూరు) : ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాటకాలాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ట్రేడ్ యూనియన్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట శుక్రవారం 24 గంటల దీక్షలు ప్రారంభమయ్యాయి. జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.అయ్యస్వామితో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన 20 మంది ప్రతినిధులు దీక్షల్లో పాల్గొన్నారు. దీక్షలను ప్రారంభించిన గౌతంరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేవలం అసెంబ్లీలో తీర్మానాలు చేసి చేతులు దులుపుకొంటే సరిపోదని, రోడ్డెక్కి ఆందోళన చేపడితేనే హోదా సాధ్యపడుతుందని చెప్పారు. రాష్ట్ర విభజన చట్టంలో రూ.60 వేల కోట్లు ప్యాకేజీ ఇస్తారని ఉంటే, చంద్రబాబు ఇప్పుడేదో కొత్తగా తాను ప్యాకేజీ కోసం పాటుపడుతున్నట్టు ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
జగన్ దీక్ష విజయవంతం చేయాలి
ఈనెల 26వ తేదీన గుంటూరు కేంద్రంగా వైఎస్సార్ సీపీ అధినేత ైవె ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరవధిక నిరాహారదీక్షకు సన్నద్ధమవుతున్నారని చెప్పారు. విద్యార్ధులు జగన్ దీక్షకు పెద్దఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు.
విద్యార్థులదే కీలక పాత్ర
ప్రత్యేకహోదా సాధనసమితి రాష్ట్ర అధ్యక్షుడు కారెం శివాజీ మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తు కోసం జరిగే పోరాటంలో విద్యార్థులే కీలక పాత్ర పోషించాలని కోరారు. జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.అయ్యస్వామి మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాకట్టుపెడుతున్నాయని మండిపడ్డారు. పలు రాజకీయ, కార్మిక, ప్రజా సంఘాల నేతలు పాల్గొని దీక్షలకు సంఘీభావాన్ని తెలియజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ కృష్ణాజిల్లా నేతలు కాలే పుల్లారావు, టీవీకేఎస్ శాస్త్రి, డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు, మాలమహనాడు జిల్లా అధ్యక్షుడు కొర్రపాటి చెన్నకేశవులు, విద్యార్థి జేఏసీ నేతలు లీలామోహన్, ఎం. శ్రీనివాసరావు, సూర్యం, వెంకటరెడ్డి, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.