
‘టెన్త్’లో నూతనత్వం
పదో తరగతి విద్యార్థుల్లో విషయ అవగాహన పెంపొందించేందుకు ప్రభుత్వం నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. విద్యా ప్రమాణాలు మార్చి, అందుకు తగిన ట్లు
విజయనగరం అర్బన్: పదో తరగతి విద్యార్థుల్లో విషయ అవగాహన పెంపొందించేందుకు ప్రభుత్వం నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. విద్యా ప్రమాణాలు మార్చి, అందుకు తగిన ట్లు పరీక్ష విధానంలోనూ మార్పులు చేశారు. ఎన్నడూ లేని విధంగా ఇప్పటికే పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుంది. ఇందులో భాగంగా నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానంలో పదో తరగతి సిలబస్‌ను తయారు చేయించారు. ఇప్పటి వరకూ తెలుగు, ఇంగ్లిష్, గణితం, సైన్స్, సోషల్ పరీక్షలు రెండేసి చొప్పున, హిందీ పరీక్ష ఒక పేపరు కలిపి మొత్తం 11 పేపర్లు రాసేవారు. వీటిని తొమ్మిది పేపర్లకు కుదించారు. ఎక్స్‌టర్నల్, ఇంటర్నల్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు.
80 మార్కులకు రాత పరీక్ష
కొత్త విధానంలో మొత్తం 100 మార్కుల కు గాను 80 మార్కులకు రాత పరీక్ష, 20 మార్కులకు ఇంటర్నల్ పరీక్షలు ఉం టాయి. రాత పరీక్షలో కనీస ఉత్తీర్ణత మార్కులు 27, ఇంటర్నల్ పరీక్షల్లో కనీస ఉత్తీర్ణత మార్కులు 7 గా నిర్ణయించారు.
భాషా పరీక్షల్లో ఒక్కొక్క పేపరు
భాషా పరీక్షల్లో ఒక్కొక్క పేపరు మాత్రమే ఉంటుంది. గతంలో హిందీ మినహా తెలుగు, ఇంగ్లిష్, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులకు ఒక్కొక్క దానికి రెండు పేపర్లు చొప్పున పరీక్షలు నిర్వహించేవారు. ఒక్కొక్క పేపరుకు 50 మార్కుల చొప్పున కలిపి మొత్తం వంద మార్కులకు ఉండేవి.కొత్త విధానంలో తెలుగు, హిందీ, ఇంగ్లిష్ (భాష) పరీక్షల్లో ఒక్కొక్క పేపరు మాత్రమే ఉంటాయి. ఇక గణితం, సైన్సు, సోషల్ సబ్జెక్టులకు రెండేసి పేపర్లు పరీక్షలు ఉంటాయి. గణితం మొదటి పేపరులో సంఖ్యలు, సమితులు, బీజగణితం, ప్రోగ్రెషన్, కోఆర్డినేట్ జామెట్రీ పాఠ్యాంశాలు ఉంటాయి. రెండో పేపరులో త్రికోణమితి, క్షేత్రగణితం, సంఖ్యాశాస్త్రాలు ఉంటాయి. సైన్స్ మొదటి పేపరులో భౌతిక, రసాయన శాస్త్రాలు, రెండో పేపరులో జీవశాస్త్రం ఉంటుంది. సోషల్ సబ్జెక్టులో మొదటి పేపరులో భూగోళం, అర్ధశాస్త్రం, రెండో పేపరులో చరిత్ర, పౌరశాస్త్రం ఉంటాయి. రాత పరీక్ష, ఇంటర్నల్ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో గ్రేడింగ్ మారనుంది.
15 ఏళ్ల తర్వాత టెన్త్ సిలబస్ మార్పు
జాతీయ పాఠ్య ప్రణాళిక ప్రకారం రాష్ట్రవిద్యా పరిశోధన మండలి పాఠ్య పుస్తకాలను మార్పు చేసింది. 2012-13 విద్యా సంవత్సరంలో మొదటగా 1, 2, 3, 6, 7 తరగతుల పాఠ్యపుస్తకాలను మార్చారు. ఈ ఏడాది (2014-15) పదో తరగతి సిలబస్‌ను మార్చారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత పదో తరగతి సిలబస్, పరీక్ష విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. మారిన సిలబస్‌లో విషయ పరిజ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఆలోచించడం, నేర్చుకున్న విషయాలను వ్యక్తీకరించడం, విశ్లేషణం, వ్యక్తీత్వాన్ని పెంపొందించేలా పాఠ్యపుస్తకాలు రూపొందించారు. నైతిక విలువలు పెంపొందించేందుకు, మహిళా సాధికారిత, వారిని గౌరవించడం తదితర విషయాలకు ప్రాధాన్యమిస్తూ పాఠ్యాంశాలను రూపొందించారు.
తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో గ్రేడింగ్ ఇలా..
మార్కులు గ్రేడ్ పాయింట్లు
91-100 ఏ-1 10
81-90 ఏ-2 09
71-80 బీ-1 08
61-70 బీ-2 07
51-60 సీ-1 06
41-50 సీ-2 05
35-40 డీ-1 04
1-34 డీ-2 03
భాషేతర సబ్జెక్టులు...
46-50 ఏ-1 10
41-45 ఏ-2 09
36-40 బీ-1 08
31-35 బీ-2 07
26-30 సీ-1 06
21-25 సీ-2 05
18-20 డీ-1 04
1-17 డీ-2 03