♦ అధికారులు తప్పించుకునేందుకే..
♦ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
ఆంధ్రా-తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులో తడ మండలం భీములవారిపాళెం ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులో ఇటీవల ప్రైవేట్ వ్యక్తుల దందా పెరిగిపోయింది. ప్రైవేట్ వ్యక్తులు డెరైక్ట్‌గా రోడ్డుమీదకొచ్చి వాహనాల నుంచి దందాలు వసూలు చేస్తున్నారు. అధికారులు, ప్రైవేట్ వ్యక్తులకు జరిగిన గొడవలు కూడా పోలీసులు దాకా రాకుండా అక్కడికక్కడే సర్దుకుంటున్నారు. ఏసీబీ దాడులు జరిగినపుడు అధికారులు తప్పించుకోవడానికి ప్రైవేట్ వ్యక్తులను అధికారులే ఏర్పాటు చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.
సూళ్లూరుపేట : భీములవారిపాళెం ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులో అత్యధిక ఆదాయం కలిగిన శాఖలుగా వాణిజ్య పన్నులు, రవాణా, గనులు, అటవీ, పశుసంవర్థక, భూగర్భ శాఖలను ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఆయా శాఖలకు పన్నులు చెల్లించకుండా రవాణా చేసే వాహనాలను పసిగట్టి ఎక్సైజ్ శాఖ పోలీసులు వసూళ్లు చేస్తున్నారు. వాహనాల రికార్డులు పరిశీలన, స్టాంపులు వేసి పంపడం వంటి పనులన్నీ ప్రైవేట్ వ్యక్తులే చూస్తున్నారు.
ఒక దశలో ప్రైవేట్ వ్యక్తులు చెక్‌పోస్టులోకి ప్రవేశించి అధికారులను బయటకు పంపేసి వారి సీట్లలో కూర్చొని విధులు నిర్వహించిన సంఘటనలు కూడా ఉన్నాయి. దీంతో గతంలో ప్రైవేట్ వ్యక్తులందరినీ అరెస్ట్ చేయించి మాన్యువల్ తనిఖీలకు స్వస్తి చెప్పి కంప్యూటరైజ్డ్ తనిఖీలు ఏర్పాటు చేయడంతో పాటు చెక్‌పోస్టు సిబ్బంది పనితీరును పసిగట్టేందుకు నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. దీంతో కొంతకాలం పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే రెండు మూడేళ్లుగా చూస్తే చెక్‌పోస్టులో మళ్లీ ఆనాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ప్రతి అధికారి ఒకరిద్దరు ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. అక్రమంగా వచ్చిన సొమ్మును వారి ద్వారా సమీపంలోని దుకాణాల్లో దాచిపెడుతున్నారు. విధులు ముగించుకుని వెళ్లేపుడు లెక్కలు చూసుకుని తీసుకెళుతున్నారనే విషయం బహిరంగ రహస్యమే. ఇదంతా ఒక ఎత్తయితే చెక్‌పోస్టు పరిసర ప్రాంతాల్లో దుకాణాలు ఏర్పాటు చేసుకున్న కొందరు కొన్ని ట్రాన్స్‌పోర్టు సంస్థలతో సత్సంబంధాలు ఏర్పరచుకుని వాహనాలు దాటిస్తూ చెక్‌పోస్టుకు దీటుగా మరో చెక్‌పోస్టు నడుపుతున్నారనే ఆరోపణలున్నాయి.
ట్రాన్సిట్ పాసుల విషయంలో కూడా..
ట్రాన్సిట్ పాసులు విషయం కూడా ప్రైవేట్ వ్యక్తుల పెత్తనం నడుస్తోంది. కొన్ని ట్రాన్స్‌పోర్టు సంస్థలకు, స్థానికంగా బియ్యం వ్యాపారం చేస్తున్న వారికి వాహనం లేకుండా ట్రాన్సిట్ పాసులు సరఫరా చేస్తున్నారు. పన్నుల ఎగవేతకు పాల్పడేందుకు కొన్ని ట్రాన్స్‌పోర్టు సంస్థలు ప్రైవేట్ వ్యక్తుల ద్వారా పాసులు పొంది ఇతర రాష్ట్రాలకు వెళుతున్నట్లు నటించి మన రాష్ట్రంలోనే ఏదో ఒక పట్టణంలో సరుకులు అన్‌లోడ్ చేస్తారు. అధికారులను మేనేజ్ చేసి వాహనం లేకుండా పాసులు పొంది కొందరు ఈ తంతు నిర్వహిస్తున్నారు. దీని వల్ల ప్రభుత్వాదాయానికి భారీగా గండిపడుతోంది.
చెక్‌పోస్టులో ‘ప్రైవేట్’ దందా
Published Mon, May 25 2015 12:50 AM | Last Updated on Sun, Sep 3 2017 2:37 AM
Advertisement
Advertisement