మలుపులో మాటు! | Cherukulapadu Narayana Reddy two areas Murder Spot | Sakshi
Sakshi News home page

మలుపులో మాటు!

Published Sun, May 28 2017 4:35 AM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM

మలుపులో మాటు! - Sakshi

మలుపులో మాటు!

నారాయణరెడ్డి హత్యకు రెండు ప్రాంతాల్లో స్పాట్‌
రామకృష్ణాపురం వద్ద కొండల్లో మరో టీం కాపు
మొదటి స్పాట్‌ పూర్తి కాగానే ఫోన్‌లో సమాచారం
జంట హత్యల్లో మరో కోణంపై విస్తృత చర్చ
ఆ వ్యక్తులు ఎవరనే విషయం సస్పెన్స్‌
పోలీసుల దర్యాప్తు ఆ దిశగా సాగాలనే డిమాండ్‌


సాక్షి ప్రతినిధి, కర్నూలు: వెఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డిని హత్య చేసేందుకు పక్కా ప్లాన్‌ సాగిందా? ఒకవేళ కల్వర్టు వద్ద దాడి చేసే అవకాశం దక్కకపోతే మరో ప్రాంతంలో అటాక్‌ చేసేందుకు పథకం రచించారా? రామకృష్ణాపురం సమీపంలో కొండ చరియల మలుపుల వద్ద మరో 25 మంది టీంతో అటాక్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నారా? అక్కడ కూడా మరో రెండు ట్రాక్టర్లు, వేట కొడవళ్లు, బాంబులతో దాడి చేసే ప్లాన్‌ ఉందా? కల్వర్టు ప్రాంతంలోనే దాడి జరిగి నారాయణ రెడ్డి హతం కావడంతో రెండో ప్రాంతంలో ఉన్న టీం కాస్తా తప్పించుకుందా? అనే వరుస ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది.

 ఒకవేళ నారాయణ రెడ్డిపై కల్వర్టు ప్రాంతంలో దాడి చేసేందుకు వీలుపడకపోతే.. కొండ చరియల మలుపుల వద్ద దాడి జరిగే అవకాశం ఉందని అక్కడ సంచరించిన వారితో పాటు గ్రామస్తులు తెలుపుతున్న వివరాల ప్రకారం తెలుస్తోంది. కల్వర్టు ప్రాంతంలోనే నారాయణ రెడ్డి చనిపోవడంతో అక్కడ కాపు కాసిన టీంకు ఫోన్ల ద్వారా ఇక్కడి వారు సమాచారం చేరవేయడంతో వారు తప్పించుకున్నట్టు తెలుస్తోంది. ఈ కోణంలో పోలీసులు విచారిస్తే మరింత మంది నిందితుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అక్కడ కాపు కాసిందెవరు?.. వాస్తవానికి ఇప్పటి వరకు నారాయణ రెడ్డి హత్య కేసులో హత్య జరిగిన ప్రాంతంలో ఉన్న నిందితుల పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి.

ఒకవేళ కల్వర్టు వద్ద నారాయణ రెడ్డిని హతమార్చడం మిస్‌ అయితే.. రామకృష్ణాపురం గ్రామానికి సమీపంలో కొండ మలుపుల వద్ద మరోసారి అటాక్‌ చేసేందుకు నిందితులు పక్కా ప్లాన్‌ రచించుకున్నారు. ఇక్కడ కూడా మరో 25 మంది కాపు కాసినట్టు తెలుస్తోంది. మరి ఇక్కడ కాపు కాసి.. అటాక్‌ చేసేందుకు ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగాల్సిన అవసరం ఉంది. వారి పేర్లు ఇప్పటివరకు బయటకు రాలేదు. అంతేకాకుండా ప్రస్తుతం దొరికిన 12 మంది నిందితులు కూడా కొండ చరియల వద్ద మరో టీం ఉందనే విషయం బయటకు వెల్లడించలేదు. ఈ పరిస్థితుల్లో కొండ చరియల వద్ద కాపు కాసిన టీంలోని వారిని కూడా అదుపులోకి తీసుకుంటే తప్ప ఈ హత్య కేసులో ఉన్న లోతెంతో అర్థమయ్యే పరిస్థితి లేదనే అభిప్రాయాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు వెలిబుచ్చుతున్నారు.

కల్వర్టు పనులను ఆపిందెవరు?.. కల్వర్టు ప్రాంతంలో హత్య చేసేందుకు వీలుగా 15 రోజుల నుంచి రెక్కీ జరిగిందని తెలుస్తోంది. పక్కాగా 20 నుంచి 25 మంది వ్యక్తులు నేరుగా అక్కడ సంచరించి మాత్రమే హత్యకు ప్లాన్‌ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ జరగాల్సిన పనులను చేయవద్దంటూ అధికార పార్టీ నేతల నుంచే ఒత్తిళ్లు వచ్చినట్టు సమాచారం. ఒకవేళ రోడ్డు పనులు జరిగితే పనులు చేసే వారు సంచరిస్తూ తమ ప్లాన్‌కు అడ్డు వస్తారని భావించే పనులు నిలిపివేశారని తెలుస్తోంది.  దీంతో అసలు పనులు చేయవద్దని వారించి నిలువరించిందెవరనే కోణంలోనూ పోలీసులు విచారణ సాగించాల్సి ఉంది. అయితే, ఇప్పటికే నిందితులు జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్నందున ఈ వివరాలన్నింటినీ పోలీసులు సేకరించే అవకాశం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వారిని పోలీసు కస్టడీకి అడిగితే తప్ప కేసులో మరింత లోతైన విషయాలు బయటకు వచ్చే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement