వైఎస్‌ఆర్‌సీపీ నేత దారుణ హత్య
కర్నూలు: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దారుణ హత్యకు గురయ్యారు. పత్తికొండ ఇంచార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న చెరుకులపాడు నారాయణ రెడ్డిపై ప్రత్యర్థులు కొందరు, బాంబులు, కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఆయన తలను చిద్రం చేశారు. పెళ్లికి వెళ్లొస్తున్న ఆయన కారుపై తొలుత బాంబులు వేసి అనంతరం చాలా విచక్షణ రహితంగా కత్తులతో నరికి చంపారు. ఈ ఘటన వెల్దుర్తి మండలం కృష్ణగిరి వద్ద చోటు చేసుకుంది. ఈ దాడిలో ఆయనకు కీలక అనుచరుడిగా ఉన్న సాంబశివుడు కూడా చంపేశారు. తనకు ప్రత్యర్థుల నుంచి ముప్పు ఉందని కొద్ది రోజుల కిందటే తన లైసెన్స్ ఆయుధాన్ని తిరిగి కొనసాగించేందుకు అనుమతికోసం పోలీసులను ఆశ్రయించినా వారు స్పందించలేదు.
ఆయన వద్ద ఎలాంటి ఆయుధాలు లేవని తెలుసుకున్న తర్వాతే ప్రత్యర్థులు పకడ్బందీగా ప్రణాళిక రచించి ఈ హత్య చేశారు. ఆదివారం ఉదయం నారాయణ రెడ్డి నంద్యాలలో సూర‍్యనారాయణరెడ్డి కుమార్తె వివాహానికి, అలాగే, వెల్దుర్తి మండలంలోని కొసనాపల్లెలో కే సాక్షి హనుమంతు కుమారుడు కే రమేశ్ వివాహానికి హాజరయ్యారు. అనంతరం ఉదయం 11.30 గంటలకు కారులో స‍్వగ్రామానికి వస‍్తుండగా కృష‍్ణగిరి మండలం రామకృష్ణాపురం గ్రామ శివారులో కల‍్వర్టు వద‍్ద కాపు కాసిన ప్రత్యర్థులు తొలుత ఆయన ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ట్రాక్టర్‌తో ఢీ కొట్టించారు.
ఆ తర్వాత ఎదురుగా మూడు ట్రాక్టర్లు పెట్టి ఆ వెంటనే బాంబులు విసిరారు. ఆ వెంటనే దాదాపు నారాయణపై దాదాపు 15 నుంచి 20 మంది ఒకేసారి దాడికి పాల్పడ్డారు. వేట కొడవళ్లతో విచక్షణా రహితంగా నరికేశారు. గత ఎన్నికల్లో ఆయన కేఈ కృష్ణమూర్తిపై ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రస్తుతం నారాయణ రెడ్డికి విపరీతమైన ప్రజాబీమానం పెరగడం, క్రీయాశీలకంగా వ్యవహరించడం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన వాళ్లే ఈ హత్య చేయించినట్లు పలువురు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.