తండ్రిని బలిగొన్నదీ టీడీపీయే..
- శివారెడ్డి హత్యానంతరం రాజకీయాల్లోకి నారాయణరెడ్డి
- అనతికాలంలోనే కీలక నేతగా ఎదిగిన వైనం
కర్నూలు (వైఎస్సార్ సర్కిల్): చెరుకులపాడు నారాయణరెడ్డి రాజకీయ ప్రస్థానం తండ్రి కంగాటి శివారెడ్డి మరణంతో మొదలైంది. కాంగ్రెస్ నేత కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కుటుంబానికి విధేయుడైన శివారెడ్డి నియోజకవర్గంలో కీలక నాయకుడిగా ఎదిగారు. శివారెడ్డి చూరగొంటున్న ప్రజాభిమానాన్ని చూసి ఓర్వలేని స్థానిక టీడీపీ దివంగత నేత ఆయన హత్యకు కుట్రపన్నారు. తద్వారా కోట్ల కుటుంబానికి చెక్ పెట్టాలని భావించారు. అనుకున్నదే తడవుగా పథకాన్ని అమలు చేసి 1988లో చెరుకులపాడులోని ఇంటి వద్దే శివారెడ్డిని అతి దారుణంగా హత్య చేయించారు. ఆ నేపథ్యంలోనే నారాయణరెడ్డి రాజకీయాల్లో ప్రవేశించారు.
అప్పట్నుంచీ కోట్ల కుటుంబానికి తన తండ్రి శివారెడ్డి లేని లోటును తీరుస్తూ ప్రజా సమస్యలపై పోరాడటమే కాకుండా, మరోవైపు టీడీపీ అరాచకాలను ఎండగట్టేందుకు అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చారు. జిల్లాలో కీలక రాజకీయ నేతగా ఎదిగారు. ఇంటి పేరు కంగాటి కాగా సొంతూరు చెరుకులపాడు నారాయణరెడ్డిగా ప్రాచుర్యం పొందారు. 2006లో కృష్ణగిరి మండల జెడ్పీటీసీగా పోటీ చేసి కేఈ జయన్న చేతిలో ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో పత్తికొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కేఈ కృష్ణమూర్తి చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత తొలినుంచీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో, మరోవైపు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజా పోరాటాలకు ఆకర్షితులై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జిగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.