నారాయణ రెడ్డి దారుణ హత్య!
– పెళ్లికి వెళ్తుండగా దారి మధ్యలో కత్తులు, రాళ్లతో దాడి
– కల్వర్టు పనులు జరుగుతున్న ప్రాంతాన్ని ఎన్నుకున్న ప్రత్యర్థులు
– తప్పించుకునే దారి లేని విధంగా ప్రణాళిక రచన
– మూడు ట్రాక్టర్లతో వాహనాన్ని గుద్దిన వైనం...
– అనంతరం మూకుమ్మడిగా 20–25 మంది దాడి
– హత్యకు కారణం కేఈ కుటుంబమేనని కుటుంబీకుల ఆరోపణ
– తనకు ప్రాణహాని ఉందని పదే పదే ఫిర్యాదులు
– అయినా పట్టించుకోని పోలీసు యంత్రాంగం
– గన్‌లైసెన్స్ లేదని తెలుసుకుని మాటు వేసి మరీ దాడి
– దాడిలో అనుచరులు సాంబశివుడు హతం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికారపార్టీ హత్య రాజకీయాలకు కర్నూలు జిల్లాలో తెరలేపింది. రాజకీయంగా ప్రజల మద్దతుతో ఎదుగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జీ చెరకులపాడు నారాయణ రెడ్డి ఆదివారం దారుణహత్యకు గురయ్యారు. కృష్ణగిరి మండలంలోని రామకృష్ణాపురం గ్రామంలో శుభకార్యానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఆయనపై కత్తులు, కొడవళ్లు, రాళ్లతో దాడి చేసి హతమర్చారు. ఉదయమే నంద్యాలకు వెళ్లి ఒక శుభకార్యంలో పాల్గొన్న నారాయణ రెడ్డి... అక్కడి నుంచి వెల్దుర్తి చేరుకుని కొత్త దంపతులను ఆశీర్వదించారు. అనంతరం కోసానపల్లెకు చేరుకుని నూతన వధూవరులను ఆశీర్వదించి హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి కృష్ణగిరి మండలంలోని రామకృష్ణాపురం గ్రామంలో పెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకు బయలుదేరారు. ఆయన సొంతగ్రామం చెరకులపాడును దాటి రామకృష్ణాపురం చేరుకోవాల్సి ఉంటుంది. చెరకులపాడు దాటి 3 కిలోమీటర్లు దాటిన తర్వాత రోడ్డు మార్గంలో కల్వర్టు పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాంతాన్ని ఆయన ప్రత్యర్థులు తమ దాడికి అనువైన ప్రాంతంగా ఎంపిక చేసుకున్నారు. అక్కడ కల్వర్టు పనుల కోసం ఏర్పాటు చేసిన సిమెంటు పైపులల్లో కొంత మంది దాక్కున్నారు. మరికొంత మంది రోడ్డు పక్కనే ఉన్న బెండకాయ తోటలో ఉన్నారు. ఇక మిగిలిన వారిలో కొంత మంది పొలంలో ట్రాక్టరుతో పనిచేయిస్తున్నట్టు ఉన్నారు. మరికొంత మంది కల్వర్టు పని కోసం ట్రాక్టర్‌ను నిలుపుకున్నట్టు నటించారు.
నారాయణ రెడ్డి వాహనంతో పాటు ముందుగా మరో వాహనం వెళుతోంది. మొదటి వాహనం కల్వర్టు పనులు జరుగుతున్న ప్రాంతానికి చేరుకోగానే భారీ రాళ్లతో దాడి మొదలు పెట్టారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేద్దామని ముందు వాహనంలోని వారు వేగంగా ముందుకు కదలారు. ఇదే సందర్భంలో నారాయణ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనుక నుంచి ఒక ట్రాక్టర్... ముందు నుంచి మరో ట్రాక్టర్లతో గుద్ది ముందుకు వెళ్లకుండా అడ్డుకాచి నేరుగా ఆయన వాహనంపై రాళ్లతో దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. అనంతరం ఆయన తలపై కత్తులు, కొడవళ్లు, రాళ్లతో బలంగా మోది హత్య చేశారు. ఈ దాడిలో ఆయన తల వెనుక భాగం పూర్తిగా ధ్వంసం కాగా... మెదడు ఊడి కారులో పడిపోయింది. ఆయన చనిపోయాడని తెలిసిన తర్వాత కూడా వాహనం నుంచి బయటకు పడేసి మరీ కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో ఆయన అనుచరులు సాంబశివుడు కూడా హత్యకు గురయ్యారు.
ఈ దాడిలో పాల్గొన్న వారిలో మూతికి కొందరు గుడ్డలు కట్టుకుని ఉన్నారు. తనపై దాడి జరుగుతుందని తెలిసిన వెంటనే నారాయణ రెడ్డి.... మీరు వెళ్లండంటూ తనతో పాటు వాహనంలో ఉన్న వారిని హెచ్చరించారు. అయితే, తమ నేతపై దాడి జరగకుండా ఆయన అనుచరుడు సాంబశివుడు ప్రయత్నించారు. దీంతో సాంబశివుడిని వెంటాడి 100 మీటర్ల వరకు ఉరికెత్తించి మరీ ఆయన్ను చంపారు. ఈ దాడిలో మొత్తం 20 నుంచి 25 మంది వరకూ పాల్గొని ఉంటారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు. అయితే, తన భర్త హత్యకు కేఈ కుటుంబమే ప్రధాన కారణమని ఆరోపించింది. తన భర్తకు ప్రాణహాని ఉందని పదే పదే ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని వాపోయింది. తమ కుటుంబానికి కేఈ కుటుంబంతో తప్పే వేరే రాజకీయ వైరం లేదని ఆయన సోదరుడు ప్రదీప్ రెడ్డి పేర్కొన్నారు. తన సోదరుడు హత్య చేయించిన వారి వెనుక ఉందని కేఈ కుటుంబమేనని ఆరోపించారు.
పునరుద్ధరించని లైసెన్స్...
రాజకీయ కక్షల నేపథ్యంలో నారాయణ రెడ్డికి గన్‌లైసెన్స్ ఉంది. ఈ ఏడాది మార్చి నెల మొదటి వారంలో తనకు ఉన్న గన్ లైసెన్స్‌ను తిరిగి పునరుద్దరించాలని నారాయణ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఇప్పటివరకు రెన్యువల్ కాలేదు. ఈ విషయం కూడా ప్రత్యర్థులకు సమాచారం అందిందని తెలుస్తోంది. ప్రత్యర్థులకు ఈ సమాచారం ఎలా అందిందని తెలియాల్సి ఉంది. అయితే, పోలీసుల నుంచే ఈ సమాచారం అధికారపార్టీ నేతలకు తెలిసిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అందుకే కేవలం కత్తులు, రాళ్లతోనే దాడికి తెగబడ్డారని సమాచారం. గన్‌లైసెన్స్ సకాలంలో పునరుద్ధరణ కాకపోవడం.... హత్య చేయాలని నిర్ణయించిన ప్రాంతం తప్పించుకుపోవడానికి అవకాశం లేకపోవడంతో దారుణహత్యకు ఆయన గురయ్యారు.
కనిపించని క్రైం సీన్ మేనేజ్‌మెంట్
హత్య జరిగిన తర్వాత సాధారణంగా ఆ ప్రాంతాన్ని మొత్తం పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుంటారు. అక్కడకు ఎవ్వరినీ రానివ్వకుండా ఆధారాల కోసం అన్వేషిస్తారు. తద్వారా హత్య చేసిన నిందితులకు సంబంధించిన ఆధారాలు ఏమైనా లభించే అవకాశం ఉంటుంది. అయితే, నారాయణ రెడ్డి హత్య జరిగిన ప్రాంతంలో ఇటువంటి క్రైమ్ సీన్ ఏమీ కనపడలేదు. సాధారణ జనంతో పాటు అందరూ కూడా నారాయణ రెడ్డి హత్య జరిగిన ప్రాంతమంతా కలియతిరిగారు. అంతేకాకుండా దాడికి గురైన వాహనాన్ని కూడా అందరూ పట్టుకుని మరీ పరిశీలించారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో హత్య జరిగితే... ఇంత జరిగిన తర్వాత మధ్యాహ్నాం రెండున్నర గంటల ప్రాంతంలో పోలీసులు వేలిముద్రల కోసం (ఫింగర్ ప్రింట్స్) ప్రయత్నించడం విమర్శల పాలవుతోంది.
శవంలోనూ రాజకీయమే..!
చెరకులపాడు నారాయణ రెడ్డి హత్య ఆదివారం 11 గంటల ప్రాంతంలో జరిగింది. నారాయణ రెడ్డితో పాటు వేరే వాహనంలో ప్రయాణించిన వారు పోలీసులకు ఫిర్యాదు కూడా అందించారు. అయితే, క్లూస్ టీం, డాగ్స్ టీం రావడంతో పాటు మొత్తం ప్రక్రియ ఆలస్యంగా జరిగిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా హత్య జరిగిన రెండు గంటల తర్వాత కానీ హాస్పిటల్‌కు నారాయణ రెడ్డి మృతదేహాన్ని తరలించలేదు. దీంతో ఆదివారం కావడంతో మృతదేహానికి ఒంటి గంట దాటిన తర్వాత పోస్టుమార్టం చేయమని డాక్టర్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం మొత్తం మృతదేహం మార్చురీలోనే ఉండిపోయింది. సోమవారం ఉదయం మృతదేహానికి పోస్టుమార్టం చేయనున్నారు. అధికారపార్టీ నేతల ఒత్తిళ్లతోనే ఈ ప్రక్రియ ఆలస్యంగా సాగినట్టు తెలుస్తోంది. తద్వారా ఆదివారం మొత్తం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని చూసుకునే అవకాశమే లేకుండా పోయింది. శవంతోనూ అధికారపార్టీ నేతలు రాజకీయం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమయ్యాయి.
పదే పదే ఫిర్యాదు చేసినా...
వాస్తవానికి తనకు డిప్యూటీ సీఎం కేఈ కుటుంబం నుంచి ప్రాణహాని ఉందని నారాయణ రెడ్డి, ఆయన భార్య శ్రీదేవి పదే పదే చెప్పేవారు. రాజకీయంగా తన ఎదుగుదలను చూసి ఓర్వలేక తనను అంత మొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని స్పష్టంగా పేర్కొనేవారు. ఇందులో భాగంగా సొంత గ్రామం చెరకులపాడులో తన ఇంటి ముందు ఉన్న జీపుపై దాడులు చేయడం... గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండానే తెలుగుదేశం పార్టీ జెండాను పాతడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని పదే పదే ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తమపై దాడులు జరిగితే... తమపైనే కేసులు పెట్టారని కూడా ఆయన వాపోయారు. తన భర్తకు హాని జరిగితే కేఈ కుటుంబానిదే బాధ్యత అని శ్రీదేవి కూడా అనేకసార్లు విలేకరుల సమావేశాల సాక్షిగా వెల్లడించారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్‌నుంచి పోటీ చేసిన ఆయన అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరినప్పటి నుంచి పత్తికొండ నియోజకవర్గంలో గడపగడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. అదేవిధంగా ప్రజలు వెల్లడించిన సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా గెలుపు నారాయణ రెడ్డిదే అనే వాతావరణం వచ్చింది. ఈ నేపథ్యంలోనే రాజకీయంగా తన ఎదుగుదలను చూసి తట్టుకోలేక తనను హత్య చేసే అవకాశం ఉందని ఆయన తన సన్నిహితులతో ఆయన పదే పదే అనేవారు. అంతేకాకుండా ఇదే విషయంపై పోలీసు ఉన్నతాధికారులకు విన్నవించారు. అయినప్పటికీ భద్రత కల్పించడంలో పోలీసు యంత్రాంగం విఫలమయ్యింది.
ప్రత్యర్థులను చేరదీసిన అధికారపార్టీ...!
నారాయణరెడ్డి ప్రత్యర్థులను అధికారపార్టీ నేతలు చేరదీశారు. ఎన్నో ఏళ్ల క్రితం ఊరు విడిచి వెళ్లిపోయిన వారిని సైతం తిరిగి గ్రామాల్లోకి చేర్పించారు. అంతేకాకుండా వారు విచ్చలవిడిగా అక్రమ ఇసుక వ్యాపారం చేసుకునేందుకు కూడా అండగా నిలిచారు. ఫలితంగా ఆర్థికంగా బలపడటంతో పాటు గ్రామంలో చిన్న విషయానికి గొడవ పెట్టుకునేందుకు పురికొల్పడంలో అధికారపార్టీ నేతల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక అక్రమ ఇసుక వ్యవహారంలో రోజురోజుకీ భూగర్బజలాలు తరిగిపోయి.... తాగునీటికీ ఇబ్బందులు వస్తున్నాయంటూ ఏకంగా హైకోర్టులో గ్రామస్తులు కేసు వేశారు. అక్రమ ఇసుక వ్యాపారంలో కేఈ శ్యాంబాబు పాత్ర ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆయన పాత్రపై హైకోర్టు ఆదేశాలతో విచారణ జరుగుతోంది. ఈ మొత్తం ఫిర్యాదు వెనుక నారాయణ రెడ్డి నాయకత్వం వహిస్తున్నారని ఆయన ప్రత్యర్థులు ఆయనపై గుర్రుగా ఉన్నారు.
కేఈ సోదరులే కారణం– నారాయణ రెడ్డి భార్య శ్రీదేవి, సోదరుడు ప్రదీప్ రెడ్డి
ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా పోరాడినందుకే నారాయణ రెడ్డిని హత్య చేశారు. పత్తికొండలో కేఈ అరాచకాలు పెరిగిపోయాయి. కేఈ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నారాయణ రెడ్డి పోరాడుతున్నారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ఆయన కుమారుడు కేఈ శ్యాంబాబుతో పాటు వెల్దుర్తి ఎస్‌ఐ నాగతులసీ ప్రసాద్ హత్యలో కీలక పాత్రదారులు. గన్‌మెన్లను ఇవ్వాలని ఉన్నతాధికారులను కోరినప్పటికీ పట్టించుకోలేదు. గన్‌లైసెన్స్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకుని మూడు నెలలు గడిచినా ఇవ్వకపోవడం వల్లే హత్య జరిగింది. నెలన్నర క్రితం ఎస్‌పీ, డీఐజీతో పాటు ఇంటలిజెన్స్ డీఐజీని కూడా కలిసి కేఈ కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉందని విన్నవించారు. అయినప్పటికీ ఏం చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ దారుణం జరిగింది.