డోన్‌తో విడదీయరాని బంధం | Ysrcp leader Cherukulapadu Narayana Reddy murdered in kurnool district | Sakshi
Sakshi News home page

డోన్‌తో విడదీయరాని బంధం

Published Sun, May 21 2017 5:54 PM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM

డోన్‌తో విడదీయరాని బంధం - Sakshi

డోన్‌తో విడదీయరాని బంధం

డోన్‌: పత్తికొండ నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సీపీ ఇన్‌చార్జ్‌ చెరుకులపాడు నారాయణ రెడ్డి ఆదివారం పెళ్లికి వెళ్లి తిరిగివస్తుండగా రాజకీయ ప్రత్యర్ధులు దారికాచి దారుణంగా హత్య చేశారు. ఈ హత్యపట్ల డోన్‌ నియోజక వర్గంలోని ఆయన సహచరులు, మిత్రులు, బంధువర్గంతో పాటు వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు తీవ్ర దిగ్ర్భాంతికి లోనయ్యారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌ రెడ్డికి బంధువు. అంతేకాక చెరుకులపాడు నారాయణ రెడ్డి స్వర్గీయ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికు  ప్రియ శిష్యునిగా పేరుగాంచారు.

గత ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాల మూలంగా కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయ సూర్యప్రకాశ్‌ రెడ్డితో విభేదించి వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పత్తికొండ నుంచి డిప్యూటీ సీఎం కేఈ క్రిష్ణమూర్తి పై పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రస్తుతం పత్తికొండ వైఎస్‌ఆర్‌సీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. నారాయణ రెడ్డి పత్తికొండ, డోన్‌ నియోజకవర్గ ప్రజలతో, ముఖ్యనాయకులతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారు. డోన్‌ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు, ముఖ్యనాయకల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు నారాయణ రెడ్డి తప్పక హాజరౌతుంటారు. ఈ ప్రాంతం ప్రజలు, ముఖ్యనాయకులను పేరుపేరునా పలకరిస్తూ అందరి అప్యాయత, అనురాగాలను పొందారు.
 
 
డోన్‌తో విడదీయరాని బంధం: నారాయణ రెడ్డి ప్రాధమిక విధ్య అనంతరం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 1982 వరకు చదివారు. తరువాత తన తండ్రి శివారెడ్డి హత్యానంతరం ఉన్నత చదువులు కొనసాగించ లేక తండ్రి రాజకీయ వారసునిగా మారారు. ప్యాపిలి మండలం, బూరుగల గ్రామానికి చెందిన సత్యకంబగిరి రెడ్డి కుమార్తె శ్రీదేవితో నారాయణరెడ్డికి వివాహాం జరిగింది.

డోన్‌ మండలం ఎద్దుపెంట గ్రామానికి చెందిన ఎల్లారెడ్డి కుమారుడు ప్రస్తుతం ఉపాధ్యాయులు వేంకటేశ్వర రెడ్డికి తన చెల్లెలు విజయలక్ష్మిని ఇచ్చి వివాహాం జరిపించారు. గ్రామ గ్రామాన రాజకీయ పరిచయాలతో పాటు వ్యక్తిగతంగా కూడా ప్రజలతో బంధం ఏర్పరుచుకున్న నారాయణ రెడ్డి హత్యకు గురయ్యారని తెలిసి  ఈ ప్రాంతం ప్రజలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. నారాయణ రెడ్డి హత్య వార్త తెలిసిన వెంటనే వేలాది మంది ప్రజలు సంఘటనా స్థలానికి, కర్నూల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలివెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement