అంధుల రాష్ట్రస్థాయి చదరంగం పోటీల్లో అనంతపురం జిల్లాకు చెందిన బి. మహేశ్ విజయబావుటా ఎగురవేశాడు.
రాజమండ్రి సిటీ, న్యూస్‌లైన్ : అంధుల రాష్ట్రస్థాయి చదరంగం పోటీల్లో అనంతపురం జిల్లాకు చెందిన బి. మహేశ్ విజయబావుటా ఎగురవేశాడు. రాజమండ్రిలోని రౌతు తాతాలు కల్యాణ మండపంలో మూడు రోజులపాటు జరిగిన ఈ పోటీలు మంగళవారం ముగిశాయి. రఘురామ్ (తిరుపతి), అంజనప్ప (అనంతపురం) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఈ పోటీల్లో 17 జిల్లాలకు చెందిన సుమారు 90 మంది పాల్గొన్నారు. విజేతలతో పాటు ప్రతిభ కనబరిచిన 20 మందికి సర్టిఫికెట్లు, నగదు పారితోషికం అందజేశారు. బహుమతుల ప్రదానోత్సవానికి అంధుల చదరంగం అంతర్జాతీయ క్రీడాకారుడు కోలా శేఖర్ అధ్యక్షత వహించగా ఓఎన్‌జీసీ ఎసెట్ మేనేజర్ పి.కె.రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
సామాజిక సేవను బాధ్యతగా గుర్తించిన ఓఎన్‌జీసీ ఏటా రూ.20 కోట్లు వికలాంగుల సంక్షేమానికి ఖర్చు చేస్తోందని రావు తెలిపారు. వికలాంగులు ఎవరైనా దరఖాస్తు చేస్తే 45 రోజుల్లో వారికి కృత్రిమ అవయవాలు ఉచితంగా అందజేస్తామన్నారు. టోర్నమెంట్ నిర్వహణకు రూ.1.2 లక్షల చెక్కును ఆయన నిర్వాహకులైన మిరాకిల్ సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్‌అధ్యక్షుడు చల్లా మహేశ్‌కు అందజేశారు. పోటీల నిర్వహణకు రూ.50 వేల ఆర్థిక సాయం అందించిన ట్రిప్స్ స్కూల్ కరస్పాండెంట్ బాలాత్రిపుర సుందరి ఆర్గనైజేషన్ కృతజ్ఞతలు తెలిపింది. గౌతమి నేత్రాలయం అధినేత మధు, వికలాంగ సంఘటన్ రాష్ట్ర అధ్యక్షుడు నిమ్మకాయల సురేష్, ఆర్గనైజేషన్ ఉపాధ్యక్షుడు రంగస్వామి, జనరల్ సెక్రటరీ సి.సుజాత తదితరులు పాల్గొన్నారు.