సాక్షి ప్రతినిధి, ఏలూరు :పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఉభయగోదావరి జిల్లాల రైతాంగం ప్రాణాలను పణంగా పెట్టి వ్యతిరేకిస్తున్నా మొండిగా ముందుకువెళుతున్న సర్కారు ఇప్పుడు నిండు శాసనసభలోనూ పచ్చి అబద్ధపు ప్రకటనలతో సమర్థించుకుంటోంది. మంగళవారం పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై జరిగిన చర్చతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అట్టుడికిపోయింది. ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు వరదల కాలంలోనే గోదావరి మిగులు జలాలను కృష్ణా డెల్టాకు తరలిస్తామని ప్రకటిస్తూ.. గోదావరి ఏడాదిలో నాలుగున్నర నెలలు పొంగుతుందని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై ఉభయగోదావరి జిల్లాల రైతాంగం భగ్గుమంటోంది. శానససభ సాక్షిగా చంద్రబాబు పచ్చి దగా ప్రకటనలు చేస్తున్నారని మండిపడుతోంది. వాస్తవానికి గోదావరికి సగటున వరద కాలం రెండు నెలలు కాగా గత కొన్నేళ్లుగా 45 రోజులుకు కూడా వరద నీరుభారీగా వస్తున్న దాఖలాలు లేవు.
ఒకవేళ భారీగా వచ్చినా నిల్వ చేసే వనరులూ లేవు. ఇప్పటికే డెల్టా ప్రాంతంలోని రెండో పంటకు ఏటా సీలేరు రిజర్వాయర్ నుంచి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. డెల్టా పంటలకు 12వేల 500 క్యూసెక్కుల నీరు అవసరం కాగా, ఆ సమయంలో గోదావరి నదిలో కేవలం 8 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే నిల్వ ఉంటోంది. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే నీరు మళ్లిస్తామని సర్కారు చెబుతోంది. సీజన్ మార్పు కారణంగా జూన్, జూలై నెలల్లో గోదావరిలో వరదనీరే ఉండటం లేదు. గత ఏడాది జూన్, జూలై నెలల్లో కూడా గోదావరిలో 8 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే నిల్వఉంది. ఇప్పటికే పుష్కర, తాడిపూడి ఎత్తిపోతల పథకాల ద్వారా 3 వేల క్యూసెక్కుల నీటిని మెట్ట ప్రాంతాల్లోని పంటలకు మళ్లిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మిస్తే డెల్టా ప్రాంతం ఎడారిగా మారిపోతుందంటూ రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే రైతన్నల మొరను ఏ మాత్రం పట్టించుకోని సర్కారు చివరికి అసెంబ్లీ సాక్షిగా కూడా మోసపూరిత ప్రకటనలు చేస్తోందని రైతు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. గోదావరి నాలుగున్నర నెలల పాటు పొంగిన చరిత్ర ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు అవే మాటలు ఇక్కడికొచ్చి మాట్లాడితే సరైన సమాధానం చెబుతామని హెచ్చరిస్తున్నారు.
వైఎస్ జగన్ బాసటతో రైతన్నల హర్షం
గోదావరి జిల్లాల రైతులకు ప్రభుత్వం ఏమాత్రం భరోసా ఇవ్వకుండా కృష్ణాడెల్టాకు నీటిని మళ్లిస్తున్న చర్యలతో రైతులలో తీవ్ర ఆందోళన నెలకొందంటూ వైఎస్ జగన్ సభలో ప్రకటించారు. పట్టిసీమ రైతుల అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గోదావరి వరద కాలం 60 రోజులు కాగా.. నాలుగున్నర నెలలు ఎప్పుడుందంటూ సర్కారును నిలదీశారు. పట్టిసీమను హడావుడిగా చేపడుతున్న ప్రభుత్వం పోలవరం నిర్మాణాన్ని పక్కన పెడుతోందన్న రైతుల అనుమానాలను నివృత్తి చేయాలని కోరారు. వైఎస్ జగన్ అసెంబ్లీ వేదికగా చేసిన పోరాటం ఇక్కడి రైతాంగానికి స్థైర్యాన్నిచ్చింది. చంద్రబాబు నయవంచన తీరును ఎండగట్టి డెల్టా రైతన్నలకు జగన్ బాసటగా నిలిచారంటూ ఇక్కడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇరిగేషన్ అధికారుల లెక్కల ప్రకారం..
ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నమోదైన గోదావరి వరద వివరాలిలా
గోదావరి ఫ్లడ్ సీజన్ జూలై నుంచి అక్టోబర్
అత్యధిక వరద కాలం జూలై నుంచి ఆగస్టు నెల వరకు మాత్రమే. ఇప్పటి వరకు జూలై, ఆగస్టు నెలల్లోనే అధిక నీటి మట్టాలు, అత్యధిక వరద నమోదయ్యాయి.
అప్పుడప్పుడు మాత్రమే సెప్టెంబర్‌లో నమోదవుతుంది.
గడిచిన 155 సంవత్సరాల నుంచి గోదావరి వరద రికార్డులను పరిశీలిస్తే 20 నుంచి 25 సార్లు మాత్రమే అత్యధిక (ప్రమాద స్థాయికి) వరద చేరింది.
1861 నుంచి ఇప్పటి వరకు కేవలం నాలుగుసార్లు అక్టోబర్ నెలలో అత్యధిక స్థాయి వరద నమోదు కాగా, ఇందులో రెండుసార్లు వరద ప్రమాద స్థాయికి చేరింది.
1861 నుంచి గోదావరి వరదలను పరిశీలిస్తే 30.10.1891లో రెండోప్రమాద హెచ్చరిక దాటి 17అడుగులకు చేరింది. (17.75 అడుగులకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు)
1.10.1948లో 8.20 అడుగుల అత్యధిక వరద నమోదైంది.
17.10.1987లో 9.75 అడుగుల స్థాయికి చే రింది.
23.10.1995లో ఒక సారి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి 17 అడుగులకు (మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి సమీపానికి) నమోదైంది.
ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 11.75 అడుగులకు చేరితే మొదటి హెచ్చరిక, 13.75 అడుగులకు చేరితే రెండో హెచ్చరిక, 17.75 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు.
60 రోజులకు మించి వరద ఉండదు
గోదావరి నదిలో 60 నుంచి 70 రోజుల వరకు మించి వరద ఉండదు. అది కూడా అన్ని జులై, ఆగష్టు, సెప్టెంబర్ నెలల్లో వస్తుంది. అసెంబ్లీలో చంద్రబాబు నాలుగు నెలలు గోదావరికి వరద వస్తుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. దీని అర్థమేమిటంటే ఆ నాలుగు నెలల పేరుతో కృష్ణా డెల్టాకు నీరు తోడే కుట్ర జరుగుతుంది. పట్టిసీమ వద్ద కడుతున్న ఎత్తిపోతల పథకం ఎంపీడీఎల్ ఎత్తు 12.5 మీటర్ల కంటే 14 మీటర్లు ఎత్తు పెంచితే గోదావరి డెల్టాకు కొంత ఇబ్బంది తప్పవచ్చు. ఎత్తు పెంచకపోతే రబీ సమయంలో కూడా కృష్ణాడెల్టాకు గోదావరి నుంచి నీరు తరలించుకోవచ్చునన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఏదిఏమైనప్పటికీ ఎత్తిపోతల పథకం ముమ్మాటికి గోదావరి జిల్లా ప్రజలకు ముప్పుగానే భావించవచ్చు.
- ప్రొఫెసర్ పీఏ రామకృష్ణంరాజు, జల వనరుల నిపుణులు
ఏడాదిలో రెండు నెలలు పాటే వరద
గోదావరి నదికి ఏటా జూలై రెండో వారం నుంచి రెండు నెలల పాటు వరద భారీగా వచ్చి చేరుతుంది. ఏడాదిలో రెండునెలలు మాత్రమే అత్యధికంగా వరదనీరొస్తుంది. అక్టోబర్, సెప్టెంబర్ నెలల్లో గత 150 సంవత్సరాల నుంచి వరద నీర్చొచ్చినా చెప్పుకోదగినంత నమోదు కాలేదు. ఇప్పటి వరకు నమోదైన వరద నీటిమట్టాలు పరిశీస్తే వాస్తవాలు తెలుస్తాయి.
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో అన్ని ఉపనదులు ఒకేసారి పొంగి ప్రవహించడం మూలంగా గోదావరికి వరదలు వస్తాయి.
- విప్పర్తి వేణుగోపాలరావు, రిటైర్డ్ ఈఈ,
గోదావరి హెడ్‌వర్క్స్, ధవళేశ్వరం
చంద్రబాబువన్నీ మాయమాటలే
గోదావరి నదికి ఏ సమయంలో వరద వస్తుందో తెలియకుండా చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. చంద్రబాబు చెప్తున్నవన్నీ పక్కా మాయమాటలు. పోలవరంను విస్మరించే కుట్ర ఇదంతా. గోదావరికి రెండు నెలలు మాత్రమే వరద నీరు వస్తుంది. అదే సమయంలో కృష్ణానదిలో కూడా వరద నీరు ఉంటుంది. ఆ సమయంలో ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణాడెల్టాకు తరలించే 80 టీఎంసీల నీరు ఎక్కడ స్టోరేజ్ చేస్తారు, కృష్ణా నదిలో కేవలం 3 టిఎంసీల నీరు మాత్రమే ఆ సమయంలో స్టోర్ చేయవచ్చు. ఇదంతా ప్రభుత్వం ఆడుతున్న నాటకం.
- రుద్దరాజు పండురాజు
పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్
మా బాబే..
Published Wed, Mar 18 2015 3:07 AM | Last Updated on Tue, May 29 2018 11:47 AM
Advertisement
Advertisement