ధ్వజమెత్తిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
హామీ ప్రకారం రుణమాఫీకి
తీర్మానం చేయాలని పట్టు
కుదరదన్న హోం మంత్రి
వైఎస్సార్‌సీపీ వాకౌట్
కాకినాడ సిటీ : టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణమాఫీ అని చెప్పిన మాట పచ్చి బూటకమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధ్వజమెత్తారు. ఆదివారం సాయంత్రం డ్వాక్రా సంఘాల ఆర్థిక పరిపుష్టి అంశంపై జిల్లాలోని ప్రజాప్రతినిధులు, డ్వాక్రా సంఘాలతో అవగాహన సదస్సు నిర్వహించారు. పాల్గొన్న శాసనసభాపక్ష ఉపనేత, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఎన్నికల్లో స్వయం సహాయక సంఘాల రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారంటూ, ఆ ప్రతిని సదస్సులో చూపించి గుర్తు చేశారు. రుణమాఫీ ప్రకటనను నమ్మి మహిళలు అధికారం కట్టబెట్టారని, అయితే అధికారంలోకి వచ్చిన తరువాత మాట తప్పి డ్వాక్రా సంఘాలను మోసం చేశారని విమర్శించారు.
ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ ప్రభుత్వ మోసపూరిత మాటలు నమ్మి మహిళా సంఘాలు తీసుకున్న రుణాలను సక్రమంగా కట్టకపోవడంతో బ్యాంక్‌లు నాన్ పేమెంట్ కస్టమర్లుగా చూస్తూ కొత్తరుణాలు మంజూరు చేయడం లేదన్నారు. ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, వరుపుల సుబ్బారావు, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ డ్వాక్రా సంఘాల రుణమాఫీయా లేక సంఘ సహాయ నిధా స్పష్టం చేయాలని నిలదీశారు.
ముందు రుణమాఫీ అని ప్రకటించి తరువాత ఒక్కొక్క సభ్యురాలికి రూ. పది వేలు వారి ఖాతాలో జమ చేస్తామని చెప్పి ఇప్పుడు మూడు విడతల్లో ఆ మొత్తాన్ని మూల నిధిగా ఇస్తామని. దీంతో వ్యాపారం మాత్రమే చేసుకోవాలని చెప్పడం బూటకంగా ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయాలని, ఆ ప్రకారం తీర్మానం చేయాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. మఖ్య అతిథిగా పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి చినరాజప్ప జోక్యం చేసుకుని ఇది అవగాహన సదస్సు మాత్రమేనని, తీర్మానం చేయడానికి ఇది వేదిక కాదు .. కుదరదన్నారు. దీంతో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపి సమావేశం నుంచి వాకౌట్ చేశారు.
తూతూ మంత్రంగా సదస్సు
డ్వాక్రా సంఘాల ఆర్థిక పరిపుష్టి అంశంపై జిల్లాలోని ప్రజాప్రతినిధులు, డ్వాక్రా సంఘాలతో అవగాహన సదస్సును తూతూ మంత్రంగా నిర్వహించారు. ఎటువంటి ప్రచారం లేకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా సంఘాల మహిళా సభ్యులను పిలవకుండా అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న సంఘాలతోనే సదస్సు నిర్వహించారు. మరో వైపు వచ్చిన డ్వాక్రా మహిళలకు ఆర్థిక పరిపుష్టిపై అవగాహన కల్పించకుండా ప్రసంగాలతోనే సరిపెట్టారు.
7,34,811 మంది ఆధార్ సీడింగ్ పూర్తి
జిల్లాలో మొత్తం 81 వేల 155 స్వయం సహాయక సంఘాలుండగా వారిలో 8 లక్షల 4 వేల 549 మంది సభ్యులుగా ఉన్నారని కలెక్టర్ అరుణ్‌కుమార్ తెలిపారు. వీరిలో ఇప్పటికే రుణమాఫీకి సంబంధించి 7 లక్షల,34 వేల,811 మంది సభ్యుల ఆధార్ సీడింగ్ పూర్తి చేశామన్నారు. డ్వాక్రా సంఘాలకు ఆర్థిక పరిపుష్టి కింద ఒక్కొక్క సభ్యురాలికి రూ.10 వేల వంతున రూ.734 కోట్ల 81 లక్షలు వస్తుందని, దానిలో మొదటి విడతగా ప్రతి సభ్యురాలుకు రూ.3 వేలు చొప్పున రూ.220 కోట్ల 44 లక్షలు జూన్ 3వ తేదీ నుంచి ఆయా సంఘాల బ్యాంక్ ఖాతాకు జమ చేస్తామన్నారు. సదస్సులో జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్యేలు వేగుళ్ళ జోగేశ్వరరావు, వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి, సున్నం రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
డ్వాక్రా రుణమాఫీ బూటకం
Published Mon, May 25 2015 1:00 AM | Last Updated on Tue, Aug 14 2018 3:47 PM
Advertisement
Advertisement