
ఒక వైపు ఇసుక రీచ్‌లపై రాజకీయ రాబంధుల అడ్డుకట్టకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంటే మరో వైపు అర్ధరాత్రుల్లో అడ్డగోలుగా ఇసుకను తరలిస్తున్నారు. గత ప్రభుత్వంలో తీసుకున్న అనుమతులను అడ్డం పెట్టుకుని విచ్చల విడిగా అక్రమ రవాణా చేస్తూ మాఫియా రెచ్చిపోతోంది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి అడ్డూ అదుపూ లేకుండా నెల్లూరు నగరంతో పాటు, పొరుగు రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. అడ్డుకోవాల్సిన పోలీసులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సాక్షి,నెల్లూరు: నదీ గర్భాల్లో సహజ నిధి ఇసుక దోపిడీ ఆగడం లేదు. నిశీధి వేళ ఇసుక మాఫియా దందా కొనసాగుతోంది. టీడీపీ హయాంలో చెలరేగిపోయిన ఇసుక మాఫియాకు చెక్ పెట్టేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కొత్త పాలసీ కోసం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో రీచ్‌ల నుంచి ఇసుక తరలింపును తాత్కాలికంగా నిలిపివేశారు. పేదల అవసరాల కోసం మాత్రం అధికారుల అనుమతితో ఇసుక తరలింపునకు ఆదేశాలిచ్చింది. ఈ వెసులుబాటును ఆసరాగా చేసుకుని ఇసుక మాఫియా గుట్టుగా ఇసుకను కొల్లగొట్టుతున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలో ఇసుక మాఫియా మాత్రం ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి పోలీసుల సహకారంతో యథేచ్ఛగా అర్ధరాత్రి వేళ ఇసుక అక్రమ రవాణా సాగిస్తోంది. గత ప్రభుత్వం
ఇచ్చిన ఇసుక తరలింపు జీఓలను అడ్డుపెట్టుకొని నెల్లూరు నగరంలో బిల్డర్స్‌కు ఇసుక ధర పెంచి విక్రయాలు చేస్తూ మాఫియా సొమ్ము చేసుకుంటుంది. అర్ధరాత్రి వేళ నగరానికి రవాణా గత ప్రభుత్వం హయాంలో నెలూరురూరల్ పరిధిలోని పొట్టేపాళెం ఇసుక రీచ్ నుంచి శ్రీహరికోటలోని షార్‌లోని నిర్మాణాలు, శ్రీసిటీలోని పలు పరిశ్రమల నిర్మాణాల కోసం ఇసుక రవాణా కోసం టీడీపీ నేతలు ప్రత్యేక అనుమతులు తీసుకొన్నారు. ఆ అనుమతులు అడ్డుపెట్టుకొని రీచ్‌లో భారీ యంత్రాలతో పరిధికి మించి ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు చేశారు. పొట్టేపాళెం నుంచి షార్‌తో పాటు శ్రీసిటీకి, అటు నుంచి ఇతర రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకకు ఇసుక తరలించి రూ.కోట్ల దోచుకున్నారు.
కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో ఇసుక మాఫియాకు చెక్ పెట్టేలా నూతన పాలసీపై కసరత్తు చేస్తున్న క్రమంలో ఇసుక రీచ్‌లను తాత్కాలికంగా నిలిపివేశారు. అయినా కూడా పొట్టేపాళెంలోని ఇసుక మాఫియా మాత్రం అడ్డదారుల్లో ఇసుక రవాణా సాగిస్తున్నారు. పొట్టేపాళెం రీచ్ నుంచి అర్ధరాత్రి యంత్రాల ద్వారా ఇసుక తవ్వకాలు చేస్తూ ట్రాక్టర్ ద్వారా రీచ్ పక్కనే ఉన్న రియల్ ఎస్టేట్ భూముల్లోకి డంప్ చేయిస్తున్నారు. డంప్ చేసిన ఇసుకను టిప్పర్లకు లోడ్ చేసి నెల్లూరు నగరంలోని అపార్ట్‌మెంట్ల నిర్మాణాల యజమానులకు విక్రయాలు చేస్తున్నట్లు సమాచారం..
పోలీసులకు మామూళ్లు
పొట్టేపాళెం రీచ్ పక్కన ఉన్న డంపింగ్ కేంద్రం నుంచి నెల్లూరు నగరానికి అర్ధరాత్రి ఇసుక తరలింపునకు కోసం పోలీసుల సహకారం అందుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతి రోజు దాదాపు 30 వాహనాల్లో 90 నుంచి 100 యూనిట్ల ఇసుకను నగరానికి అక్రమంగా రవాణా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు యూనిట్లు ఇసుకతో పాటు రవాణా చార్జీలకు నగరంలోని బిల్డర్స్ వద్ద రూ.35 వేలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇలా ప్రతి రోజు అక్రమార్కులు రూ.10 లక్షల వరకు ఇసుక వ్యాపారం సాగిస్తున్నారు.
నగరం నిద్రిస్తున్న వేళ ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాకు ఇబ్బంది లేకుండా సహకరించినందుకు నెల్లూరురూరల్ , ఐదో నగర పరిధిలోని పోలీసులకు ఒక్కో వాహనం నుంచి రూ.5 వేలు వంతున మామూళ్లు అందుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక వైపు అవినీతికి అస్కారం ఇవ్వవద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి పదేపదే ఆదేశిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం వేళ్లూనుపోయిన అవినీతి మాత్రం ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. పోలీసు అధికారులు మాత్రం అక్రమ రవాణాకు సహకరిస్తూ సొమ్ము చేసుకుంటున్న వైనం విస్మయ పరుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment