ఇబ్బంది లేకుండా 'ఇసుక' | Government measures to supply the sand in AP | Sakshi
Sakshi News home page

ఇబ్బంది లేకుండా 'ఇసుక'

Jan 27 2021 4:34 AM | Updated on Jan 27 2021 5:18 AM

Government measures to supply the sand in AP - Sakshi

సాక్షి, అమరావతి: ఇసుక కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా కోరినంత సరఫరా చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే నెలాఖరు నుంచి ఎక్కడా ఇసుక లేదనే మాట లేకుండా అడిగినంత అందించాలని నిర్ణయించింది. రాజకీయ జోక్యానికి ఏమాత్రం తావులేకుండా అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఇసుక అందించనుంది. అనుభవం, అర్హత కలిగిన పెద్ద సంస్థలకు ఇసుక నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఇసుక సరఫరా సంస్థలను పారదర్శకంగా ఎంపిక చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మెటల్‌ స్క్రాప్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ (ఎంఎస్‌టీసీ)కి అప్పగించింది. రాష్ట్రంలోని 13 జిల్లాలను మూడు విభాగాలుగా విభజించి వేర్వేరుగా బిడ్లు స్వీకరించి ఇసుక సరఫరా సంస్థలను ఎంపిక చేసేందుకు సాంకేతిక కసరత్తు పూర్తి చేసిన ఎంఎస్‌టీసీ టెండర్‌ ప్రకటన జారీ చేసింది. ఆసక్తి చూపిన సంస్థలతో సోమవారం రాత్రి ప్రీ బిడ్‌ సమావేశం నిర్వహించింది. ప్రీ బిడ్‌ సమావేశంలో వ్యక్తం చేసిన ప్రతి సందేహాన్ని నివృత్తి చేసేలా త్వరలో రాతపూర్వకంగా సమాచారం ఇస్తామని ఎంఎస్‌టీసీ ప్రతినిధి ‘సాక్షి’కి తెలిపారు.  

4న టెక్నికల్‌ బిడ్ల స్వీకరణ 
ఫిబ్రవరి 4వతేదీ మధ్యాహ్నం మూడు గంటల్లోగా టెక్నికల్‌ బిడ్లు సమర్పించాలని ఎంఎస్‌టీసీ  పేర్కొంది. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఎంఓయూ మేరకు ఇసుక సరఫరా సంస్థల ఎంపిక కోసం రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి వేర్వేరుగా బిడ్లు ఆహ్వానిస్తూ టెండర్‌  నోటిఫికేషన్‌ జారీ చేసింది.  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలను ఒక రీచ్‌గానూ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలను మరో రీచ్‌గానూ,  నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలను మూడో రీచ్‌గానూ టెండర్లు స్వీకరించనుంది. అర్హతలు, టర్నోవర్, అనుభవం వివరాలను టెండర్‌ దరఖాస్తులో పొందుపరిచారు. రూ.25 లక్షలు (జీఎస్టీ కాకుండా) చెల్లించి దరఖాస్తు ఫారాలను ఎవరైనా పొందవచ్చు. ఇందులో విధి విధానాలు, నిబంధనలు  స్పష్టంగా పేర్కొన్నారు. టెక్నికల్‌ బిడ్లను ఎంఎస్‌టీసీ పరిశీలించిన అనంతరం నిర్దేశిత ప్రమాణాలు కలిగిన సంస్థలను అర్హమైనవిగా ప్రకటిస్తుంది.  

అర్హత సాధించిన సంస్థలు ఫైనాన్షియల్‌ బిడ్లకు
సాంకేతిక బిడ్లలో అర్హత సాధించిన సంస్థలను ఫైనాన్షియల్‌ బిడ్లకు ఆహా్వనిస్తారు. మూడు జోన్లకు అధిక మొత్తానికి కోట్‌ చేసి (హెచ్‌ – 1)గా నిలిచిన సంస్థలను సక్సెస్‌ బిల్‌ బిడ్డర్లుగా నిర్ణయించి రాష్ట్ర భూగర్భ గనులశాఖ సంచాలకులకు తెలియచేస్తారు. ఆయా సంస్థలతో సంచాలకులు ఒప్పందం చేసుకోనున్నారు. నిర్ణయించిన డిపాజిట్‌ చెల్లించడంతోపాటు నిబంధనలన్నీ పాటించిన సంస్థలకు ఇసుక సరఫరా బాధ్యతలు అప్పగిస్తారు. ఆయా ప్రాంతాల పరిధిలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ప్రజలకు కోరినంత ఇసుకను ఆయా సంస్థలు రీచ్‌లు/ స్టాక్‌ పాయింట్లలో అందించాలి. ఈ మేరకు ఇసుకను అందుబాటులో ఉంచే బాధ్యత ఈ సంస్థలపై ఉంటుంది.  

నచ్చిన రీచ్‌లో తీసుకోవచ్చు.. 
ప్రజలు తమకు నచ్చిన రీచ్‌/నిల్వ కేంద్రం వద్దకు వెళ్లి నాణ్యతను స్వయంగా పరిశీలించి అక్కడికక్కడే డబ్బు చెల్లించి రసీదు తీసుకుని అద్దె/ సొంత వాహనాల్లో ఇసుక తీసుకెళ్లవచ్చు. పరిమాణంపై ఎలాంటి పరిమితులు ఉండవు. ఆన్‌లైన్‌ బుకింగ్‌ స్థానంలో ఆఫ్‌లైన్‌ విధానం ఉంటుంది. సర్వర్‌ మొరాయించడం, ఆన్‌లైన్‌ ఇబ్బందులు, సిఫార్సులకు తావుండదు. 

ఎడ్ల బండ్లలో ఉచితమే
నదీ పరిసర ప్రాంతాల ప్రజలు సొంత అవసరాల కోసం ఎడ్ల బండ్లలో ఇసుకను ఉచితంగా తీసుకెళ్లే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వం నిర్మించే సహాయ పునరావాస కాలనీల ఇళ్లకు కూపన్ల ద్వారా ఉచితంగా ఇసుక తీసుకెళ్లవచ్చు. ఇసుక కొరత లేకుండా ప్రభుత్వం ఇప్పటికే 500 రీచ్‌లను గుర్తించింది. వీటికి వేగంగా అన్ని రకాల అనుమతులు తెచ్చే పనిలో అధికారులున్నారు. ప్రకాశం, ధవళేశ్వరం బ్యారేజీల్లో జలవనరులు, భూగర్భ గనుల శాఖలు డ్రెడ్జింగ్‌ ద్వారా ఇసుకను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. బ్యాతమెట్రిక్‌ సర్వే ద్వారా ఇక్కడ భారీగా ఇసుక నిల్వలున్నట్లు గుర్తించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement