
సాక్షి, అమరావతి: రహదారులు, భవనాల శాఖ టెండర్లను సాంకేతిక మదింపు కమిటీ అనుమతించి, ఫైనాన్స్ బిడ్లు తెరిచాక ఏ ఫిర్యాదులొచ్చినా, అనుమానాలున్నా చర్యలు తీసుకుంటామని ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు స్పష్టం చేశారు. విజయవాడలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఎన్‌డీబీ) సహకారంతో రాష్ట్రంలో చేపడుతున్న రహదారులు, వంతెనల అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్ డాక్యుమెంట్లను జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదించాక ఆధారాల్లేకుండా వార్తలు ప్రచురిస్తే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. కొన్ని పత్రికలు దురుద్దేశంతో అసత్య కథనాలు ప్రచురిస్తున్నాయని, ప్రభుత్వంపై అపోహలు కలిగేలా వార్తలు రాస్తున్నాయన్నారు. ఇంకా ఏమన్నారంటే..
► ఆర్‌అండ్‌బీ టెండర్లను డివిజన్ల వారీగా చేపట్టేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనమిక్ అఫైర్స్‌కు, రుణం అందిస్తున్న ఎన్‌డీబీకి ప్రతిపాదనలు పంపాం. ఇందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనమిక్ అఫైర్స్, ఎన్‌డీబీ అంగీకరించలేదు. జిల్లాల వారీగా ప్యాకేజీలుగా అనుమతిస్తే సులభంగా ఉంటుందని భావించాయి.
► ఏపీ, తెలంగాణ రవాణా ముఖ్య కార్యదర్శులు మంగళవారం హైదరాబాద్‌లో భేటీ అయ్యి అంతర్రాష్ట్ర ఒప్పందంపై చర్చిస్తారు. ఒప్పందం ఆలస్యమవుతున్నందున 72 వేల కి.మీ బస్సులు తిప్పేందుకు ప్రతిపాదించాం.