ప్రమాదవశాత్తు నీటితొట్టిలో పడి మూడేళ్ల చిన్నారి సోమవారం మృతి చెందింది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని వాడి పంచాయతీ దూప్‌సింగ్ తండాకు చెందిన మాడావత్ సేవ్య, నిర్మల దంపతులకు ఏకైక సంతానం నందు(3)
మెదక్ రూరల్, న్యూస్‌లైన్: ప్రమాదవశాత్తు నీటితొట్టిలో పడి మూడేళ్ల చిన్నారి సోమవారం మృతి చెందింది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని వాడి పంచాయతీ దూప్‌సింగ్ తండాకు చెందిన మాడావత్ సేవ్య, నిర్మల దంపతులకు ఏకైక సంతానం నందు(3). దిన చర్యలో భాగంగా సేవ్యా దంపతులు కుమార్తె నందును ఇంటి వద్ద తోటిపిల్లలతో వదిలి వ్యవసాయ పనులకు వెళ్లారు. అయితే నందు ఆడుకుంటూ నీటి తొట్టి వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందింది.
కాగా మృతురాలు తల్లిదండ్రులు సాయంత్రం వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వచ్చారు. అనంతరం చేతులు, కాళ్లు కడిగేందుకు నీటి తొట్టి వద్దకు వెళ్లారు. అయితే అప్పటికే తొట్టిలో చిన్నారి నందు విగతజీలా అందులో పడి ఉంది. ఈ దృశ్యాన్ని చూసిన ఆ దంపతుల రోదనలు ఆపడం ఎవరి తరం కాలేదు.
కోటి నోముల ఫలం చిన్నారి...
సేవ్యా, నిర్మల దంపతులకు సంతానం లేక ఎన్నో పూజల ఫలితంగా పట్టిన చిన్నారి నందు నీటి తొట్టి రూపంలో మృత్యువు కబలించడంతో ఆ దంపతుల రోదనలు ఆపటం ఎవరితరం కాలేదు. ఈ విషయం తెలుసుకున్న తండా వాసులు పెద్ద ఎత్తున తరలివచ్చి కన్నీరు పెట్టుకున్నారు. గ్రామ సర్పంచ్‌తో పాటు పలువురు చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చారు.