
చిట్టి తల్లి ఆశ తీరకుండానే..
తమ్ముడికి రాఖీ కట్టాలన్న ఆ చిట్టితల్లి చిన్ని ఆశ తీరనేలేదు..పెద్దవాళ్లతో పాటు కాలిన గాయాలతో రెండురోజుల పాటు ఆస్పత్రిలో నరకయాతన అనుభవించి
రావాడ (భోగాపురం) : తమ్ముడికి రాఖీ కట్టాలన్న ఆ చిట్టితల్లి చిన్ని ఆశ తీరనేలేదు..పెద్దవాళ్లతో పాటు కాలిన గాయాలతో రెండురోజుల పాటు ఆస్పత్రిలో నరకయాతన అనుభవించి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. భోగాపురం మండలంలోని రావాడ గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో మహిళ సూర్యకుమారి సజీవ దహనం కాగా ఆమె భర్త కలిదిండి సాంబమూర్తి రాజు, చెల్లెలి కూతురు సుధారాణి, కొడుకు కూతురు జాహ్నవి (7) గాయాల పాలైన విషయం విదితమే. క్షత గాత్రులను చికిత్సనిమిత్తం విశాఖ కేజీహెచ్‌లో చేర్చారు.
అయితే శనివారం సాంబమూర్తి రాజు చికిత్సపొందుతూ మరణించారు. అలాగే ఆదివారం ఉదయం నాలుగు గంటల సమయంలో చిన్నారి జాహ్నవి మృత్యువుతో పోరాడలేనంటూ కన్నుమూసింది. ఒకే ఇంట్లో ప్రతిరోజూ వరుస మరణాలు సంభవిస్తుండడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది. ఎస్సై దీనబంధు చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఎంపీపీ కర్రోతు బంగార్రాజు, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ దంతులూరి సూర్యనారాయణ రాజు. మాజీ సర్పంచ్ వాసుదేవ వర్మ, ఎంపీటీసీ సభ్యుడు ఎ.సూర్యనారాయణ, ఉపసర్పంచ్ అప్పురభుక్త పైడినాయుడులతో పాటు స్థానికులు, యువకులు ఆ కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు.