బాల్య వివాహానికి సోమవారం అధికారులు అడ్డుకట్టవేశారు. విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం గవరపాలెం గ్రామానికి చెందిన
కె.కోటపాడు : బాల్య వివాహానికి సోమవారం అధికారులు అడ్డుకట్టవేశారు. విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం గవరపాలెం గ్రామానికి చెందిన బాలిక (14) తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలోని ప్రేమ చైల్డ్‌కేర్ డెవలప్ సెంటర్లో 9వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు ఆమెకు వివాహం తలపెట్టి, చదువు మధ్యలోనే ఆపించి ఇంటికి తీసుకువచ్చారు. దగ్గరి బంధువైన యువకుడితో బుధవారం నిశ్చితార్థం చేసేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు, ఇంటిగ్రేడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ సభ్యులు బాలిక ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. తగిన వయసు రాకుండా వివాహం చేయడం అనర్థదాయకమన్నారు. వివాహ వయసు వచ్చిన తరువాతే కుమార్తెకు వివాహం చేస్తామని వారు అధికారులకు అంగీకార పత్రాన్ని రాసి ఇచ్చారు. ఐసీడీఎస్ పీఓ ఎం.ఎన్.రాణి, ఇంటిగ్రేడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ లీగల్ అధికారులు భారతి, ప్రమీల పాల్గొన్నారు.