తూర్పునకు పెద్దపీట
మొదటిసారి దక్కిన ‘హోం’ పీఠం
‘తొలి’ హ్యాట్రిక్ సాధించిన చినరాజప్ప
ఆర్థికశాఖ పగ్గాలు మరోసారి యనమలకే
అదనంగా వాణిజ్య పన్నులు, సభా వ్యవహారాలు
సాక్షి, కాకినాడ : కొత్త రాష్ర్టపు తొలి ప్రభుత్వంలో జిల్లాకు గతంలో ఎన్నడూ లేని ప్రాధాన్యం దక్కింది. ఇప్పటికే జిల్లా నుంచి తొలిసారి ఉప ముఖ్యమంత్రిగా ఎంపికైన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పకు హోం శాఖను కేటాయించారు. జిల్లా ప్రజా ప్రతినిధికి ఈ శాఖ దక్కడమూ ఇదే మొదటిసారి. బుధవారం జరిగిన మంత్రివర్గ కూర్పులో చినరాజప్పకు హోంశాఖను ఇవ్వడంతో పాటు శాసనమండలిలో టీడీపీ పక్షనేత యనమల రామకృష్ణుడికి మరోసారి ఆర్థిక శాఖను కేటాయించారు. యనమలకు దాంతో పాటు వాణిజ్యపన్నులు, శాసనసభా వ్యవహారాల శాఖలనూ అప్పగించారు.
కోనసీమకు చెందిన చినరాజప్పకు చివరి నిమిషంలో పెద్దాపురం టికెట్ ఇవ్వగా, కనీసం వారం రోజులు కూడా ప్రచారం చేయని ఆయన అనూహ్యమైన రీతిలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా తొలిసారి గెలవగానే.. ఆయన జిల్లా నుంచి ఉప ముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా పదవులను పొందిన తొలినేతగా చరిత్ర పుటలకెక్కడం విశేషం.తుని నుంచి డబుల్ హ్యాట్రిక్ సాధించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు 2009లో ఓటమి పాలైన అనంతరం రాజ్యసభ సభ్యునిగా యత్నించి విఫలమయ్యారు. గతేడాదిలో శాసనమండలి సభ్యుడైన యనమల ఇప్పుడు అదే కోటాలో చంద్రబాబు కేబినెట్‌లో చోటు దక్కించుకోవడమే కాక మరోసారి ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టారు. యనమల గతంలో చంద్రబాబు కేబినెట్‌లో 1999 నుంచి 2003 వరకు ఆర్థికశాఖ మంత్రిగా ఉన్నారు.
ఆశతో నిరీక్షిస్తున్న సీనియర్లు
కాగా కేబినెట్ విస్తరణలో తమకు అవకాశాలు దక్కకపోతాయా అని సీనియర్ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తోట త్రిమూర్తులు ఎదురుచూస్తున్నారు. వీరితో పాటు మత్స్యకార కోటాలో వనమాడి వెంకటేశ్వరరావు, శెట్టిబలిజ కోటాలో పిల్లి అనంతలక్ష్మి కూడా తీవ్రంగా యత్నిస్తున్నారు. వీరంతా ఇప్పటికే తమ లాబీయింగ్‌ను మొదలు పెట్టారు. ఇక రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావును డిప్యూటీ స్పీకర్ పదవి వరించనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.