
అమరావతి: చింతలపుడి ప్రాజెక్టు పూర్తయితే మైలవరం రైతులకు మేలు జరుగుతుందని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. శాసనసభలో గురువారం ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి అయితే.. లక్షలాది ఎకరాల వ్యవసాయ భూమికి నీరు అందుతుందని తెలిపారు.
చింతలపూడి ఎమ్మెల్యే వీఆర్ ఎలిజా మాట్లాడుతూ... రైతులకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పెద్దపీట వేసిందని అన్నారు. జగన్ ప్రభుత్వం చింతలపుడి ప్రాజెక్టు కోసం పెద్ద సంఖ్యలో నిధులు కేటాయించారని తెలిపారు. అదే విధంగా చింతలపుడి పూర్తిగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం అని.. చింతలపుడి ప్రాజెక్టు వైఎస్సార్ హయాంలో ప్రారంభించారని వెల్లడించారు. గత ప్రభుత్వం చింతలపుడిని నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. రైతులకు చెల్లించే నష్టపరిహారం విషయంలో కూడా చంద్రబాబు సర్కార్‌లో అన్యాయం జరిగిందని మండిపడ్డారు. అదే విధంగా నీటిపారుదల శాఖలో భారీగా అవినీతి జరిగిందని విమర్శించారు. వెంటనే గత ప్రభుత్వ అవినీతిపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.