![tdp leaders money Distribution in election campaign - Sakshi](/styles/webp/s3/article_images/2024/04/10/vja.jpg.webp?itok=SfHo-iC2)
గన్నవరం నియోజకవర్గం రామవరప్పాడులో డబ్బు పంపిణీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ (ఫైల్)
క్షేత్ర స్థాయిలో టీడీపీ ప్రచారానికి స్పందన కరువు
ద్వితీయ శ్రేణి నాయకులకు తాయిలాల ఎర వేస్తున్న ఆ పార్టీ అభ్యర్థులు
ప్రచారంలో సైతం డబ్బు పంపిణీ
మైలవరం, విజయవాడ వెస్ట్, గన్నవరంలో భారీగా ప్రలోభాలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ప్రజాక్షేత్రంలో టీడీపీకి ఎదురుగాలి వీస్తోంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతుంటే, ప్రతిపక్ష టీడీపీలో మాత్రం నైరాశ్యం నెలకొంది. గ్రామాల్లో ప్రచారానికి వెళ్లినా నేతలకు స్పందన కానరావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అసంతృప్తిలో ఉన్న టీడీపీలోని ద్వితీయ శ్రేణి నాయకులకు ఎర వేసి, వారిని తమవైపు తిప్పుకొనేందుకుప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా గన్నవరం, గుడివాడ, మైలవరం, తిరువూరు, విజయవాడ వెస్ట్ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారాల్లోనూ డబ్బుతో ఓటర్లకు గాలం వేస్తున్నారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో అసంతృప్తిగా ఉన్న టీడీపీ నేతలు చేజారిపోకుండా నోట్ల కట్టలతో బేరం పెడుతున్నారు. మచిలీపట్నంలో జనసేన ఎంపీ అభ్యర్థి బాలశౌరికి ఎదురుగాలి వీస్తుండటంతో కొంతమంది ద్వితీయ శ్రేణి నేతలకు తాయిలాలు ఇచ్చి తమ వైపు తిప్పుకోవడానికి తంటాలు పడుతున్నారు.
ప్రచారంలోనూ డబ్బు పంపిణీ
విజయవాడ వెస్ట్ నియోజక వర్గంలో ప్రచారంలో తొలిరోజే బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి, టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని వినూత్న మార్గాన్ని ఎంచుకొన్నారు. హారతి ఇస్తే రూ.వెయ్యి, కొబ్బరికాయలు కొడితే రూ.వెయ్యి అంటూ మహిళలకు తాయిలాల ఎర వేశారు. ప్రచారంలో మహిళలు వరుసగా అభ్యర్థులకు హారతి ఇవ్వడం తంతుగా మారింది. గన్నవరంలో యార్లగడ్డ వెంకటరావు కూడా ఇదే తరహాలో డబ్బు పంపిణీ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రచారంలో పాల్గొన్న వారికి రూ.500, చికెన్, మటన్ భోజనాలు, పార్టీ జెండాలు మోసిన వారికి విచ్చల విడిగా మద్యం బాటిళ్లు పంచుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గుడివాడలో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ప్రచారంలో పెయిడ్ ఆర్టిస్ట్ లను ఏర్పాటు చేసుకొన్నారని తెలుస్తోంది. తిరువూరులో కొలికపూడి శ్రీనివాస్ డబ్బునే ఆయుధంగా ఎంచుకొన్నారు. గిరిజన తండాలు, ఎస్సీ కాలనీలో ప్రజలనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే గన్నవరంలో టీడీపీ అభ్యరి్థ యార్లగడ్డ వెంకటరావు గ్రామ కమిటీల ద్వారా ఇళ్ల స్థలాలు ఇస్తామని దర ఖాస్తులు స్వీకరించి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేశారు. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో పెద్ద ఎత్తున మహిళలకు చీరెలు పంపిణీ చేశారు.
ద్వితీయ శ్రేణి నాయకులకు వల
వైఎస్సార్ సీపీ పార్లమెంటు అభ్యర్థి కేశినేని నానికి నియోజకవర్గంలో బలమైన క్యాడర్‌తోపాటు టాటా ట్రస్ట్ ద్వారా సేవలు అందించిన మంచి పేరుంది. ఈ నేపథ్యంలో టీడీపీ పార్లమెంటు అభ్యర్థి కేశినేని చిన్ని ప్రచారానికి ప్రజా స్పందన లేకపోవడంతోపాటు అసంతృప్తితో ఉన్న టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులను ప్రలోభాలుపెడుతున్నట్లు సమాచారం తెలుస్తోంది. నాయకుని స్థాయిని బట్టి డబ్బు ముట్టజెప్పి, పార్టీలో చేరికలు అంటూ కలరింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే ఆయన విజయవాడ తూర్పు, సెంట్రల్, వెస్ట్, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు నియోజక వర్గాలో వారి స్థాయిని బట్టి ద్వితీయ శ్రేణి నాయకులకు డబ్బు పంపిణీ పూర్తి చేశారు.
మైలవరం నియోజక వర్గంలో నేతలంతా తమ వెంటే ఉన్నారని చెప్పుకొనేందుకు వసంత కృష్ణ ప్రసాద్ తంటాలు పడుతున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజల్లో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రస్తుతం వైఎస్సార్ సీపీ నేతలు ఎవ్వరూ ఆయనకు మద్దతుగా లేకపోవడంతో, టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులకు డబ్బులతో గాలం వేస్తున్నారు. విజయవాడ వెస్ట్‌లో సుజనాచౌదరి సైతం ద్వితీయ శ్రేణి నాయకులపై ఫోకస్ పెట్టి, తాయిలాల పంపిణీ చేసి తమ వైపు తిప్పుకొనేందుకు ప్రయతి్నస్తున్నారు. మొత్తం మీద కూటమి అభ్యర్థులకు ఎదురుగాలి వీస్తుండటంతో, ఓటర్లను, ద్వితీయ శ్రేణి నేతలను ఆకర్షించడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment