సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలులోని సినిమా థియేటర్లు అడ్డగోలు దోపిడీకి తెరలేపాయి. నిబంధనలకు వ్యతిరేకంగా టిక్కెట్ ధరలను పెంచి అమ్ముతున్నాయి. నిబంధనలు అమలు పరచాల్సిన రెవెన్యూ సిబ్బంది ‘మామూళ్ల’ మత్తులో జోగుతున్నారు. కొత్త సినిమా వచ్చిందంటే థియేటర్ల యాజమాన్యాలు ప్రేక్షకుడిని నిలువునా దోచేస్తున్నాయి. ఏ సినిమా హాల్‌లో కూడా వీటి ధర ఎంత అనే కనీస సమాచారం కూడా బోర్డులపై ఉండదు. పెద్ద హీరోల సినిమాలు వస్తే రిజర్వుడు క్లాస్ ధర ఆకాశంలో ఉంటుంది. మొదటి రోజున బెనిఫిట్‌షో వేస్తే ఒక్కో టిక్కెట్ రెండు వందల రూపాయలకు విక్రయిస్తున్నారు. మిగిలిన షోలకు వంద రూపాయలకు అమ్ముతున్నారు.
సినిమా హిట్ అయ్యిందటే వారం రోజుల పాటు బ్లాక్‌లో కొనుక్కోవల్సిందే. బుకింగ్‌లో నామమాత్రంగా టిక్కెట్లు ఇచ్చి అయిపోయాయని చెబుతారు. థియేటర్ యాజమాన్యాలు తమ సిబ్బందితోనే బ్లాక్‌లో టిక్కెట్లు అమ్మిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో మల్టిప్లెక్స్ పేరుతో ఉన్న థియేటర్లకు మాత్రమే టిక్కెట్ వంద రూపాయలకు అమ్మడానికి అనుమతి ఉంది. మిగిలిన వాటిలో ఎయిర్ కండీషన్డ్ థియేటర్ అయితే రిజర్వుడ్ క్లాస్ ధర రూ.75, ఎయిర్ కూలింగ్ అయితే రూ. 70 రూపాయలు అమ్మాల్సి ఉంది. నాన్ ఏసీ థియేటర్లయితే రిజర్వుడు ధర రూ.40 లుగా ఉండాలి. అయితే ఈ నిబంధనలు అసలు అమలు కావు. ఏ టిక్కెటయినా వంద రూపాయలు చెల్లించాల్సిందే.
కొన్ని థియేటర్లు టిక్కెట్లపై ధర రూ.70 ముద్రించినా వంద రూపాయలకే అమ్ముతారు. అడిగితే దౌర్జన్యమే. మరికొన్నింటిలో అసలు టిక్కెట్‌పై ధర ముద్రించకుండా కేవలం రిజర్వుడ్ క్లాస్ అని మాత్రమే ముద్రిస్తున్నారు. వంద రూపాయలు పెట్టి సినిమాలకు వెళ్లినా థియేటర్లలో ఏ మాత్రం సదుపాయాలుండవు. పరిశుభ్రత అన్నదే కనపడదు. సినిమా టిక్కెట్ల ధరలు నిర్ణయించాల్సిన జాయింట్ కలెక్టర్‌గాని, లెసైన్స్ మంజూరు చేసే ఆర్‌డీవో గాని, ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. తనిఖీలు నిర్వహించిన తహసీల్దారులు అటువైపే దృష్టి సారించడం లేదు. ఇటీవల విడుదలైన రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గోవిందుడు అందరివాడే’ సినిమా విడుదలయింది. అన్ని థియేటర్లలో టిక్కెట్లు అడ్వాన్స్ బుకింగ్ పేరుతో బ్లాక్ దందా యథేచ్ఛగా కొనసాగించారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ శ్రీకాంత్‌ను వివరణ కోరగా జిల్లా రెవెన్యూ యంత్రాంగం దాడులు నిర్వహిస్తే తాము సహకరిస్తామని అన్నారు.
కొత్త సినిమా వస్తే పండుగే
Published Sun, Oct 5 2014 1:46 AM | Last Updated on Thu, Aug 9 2018 7:28 PM
Advertisement
Advertisement