సాక్షి, విజయవాడ : కోట్లాది రూపాయల మేర జనాన్ని మోసం చేసిన చీటర్ నార్ల వంశీకృష్ణ చివరికి కటకటాలపాలయ్యాడు. ఆయన్ని ఐదురోజులుగా తమ అదుపులో ఉంచుకుని విచారణ చేసిన విజయవాడ పోలీసులు శనివారం అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. వంశీకృష్ణ చేసిన అక్రమాలను విజయవాడ డీసీపీ రవిప్రకాష్ విలేకరులకు వివరించారు.
క్రైం విలేకరిగా జీవితం ప్రారంభం...
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నార్ల వంశీకృష్ణ కుటుంబం విజయవాడకు వచ్చి స్థిరపడింది. ఇక్కడే చదివి ఎంబీయే పూర్తిచేసిన అతను 1995-2000 కాలంలో ఒక పత్రికలో క్రైమ్ విలేకరిగా పనిచేశాడు. దీంతో పోలీసులు, ఇతర అధికారులతో పరిచయాలు ఏర్పడ్డాయి. అదే సందర్భంలో వీనస్ ఏజెన్సీ అనే పేరుతో బ్యాంక్ రుణాల రికవరీ సంస్థను ఏర్పాటు చేశాడు. దీనిద్వారా బ్యాంకులతో సంబంధాలు ఏర్పరచుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. విజయవాడ నగరంలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే కొందరికి ఆశ చూపాడు. వారి నుంచి డబ్బులు తీసుకున్నాడు.
ఆ మేరకు భూమి కొనుగోలు చేసి.. డెవలప్‌మెంటు పేరుతో ఇంకా కొందరిని భాగస్వాములను చేసుకున్నాడు. బ్యాంకులకు సంబంధిత భూమిని గ్యారెంటీగా చూపి రూ.1.5 కోట్ల రుణాలు తీసుకున్నాడు. అందుకోసం కొందరి సంతకాలను ఫోర్జరీ చేశాడు. విజయవాడలో రియల్టర్‌గా నిడుమానూరులో వీనస్ ఎన్‌క్లేవ్, భవానీపురంలో తులసీరాం ఎన్‌క్లేవ్, తాడేపల్లిలో వైశ్రాయ్ హైట్స్‌లను నిర్మించాడు. కొన్నిచోట్ల భూమి సొంతదారుడికి ఇవ్వాల్సిన ఫ్లాట్లను ఇతనే బుక్ చేసుకున్నాడు.
కొన్ని సందర్భాల్లో ఒకే అపార్టుమెంటును ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువమందికి రిజిస్ట్రేషన్ చేసి మోసం చేశాడు. అపార్టుమెంటులో ఫ్లాట్ కోసం అడ్వాన్స్ ఇచ్చిన వారికి నిర్మించి అప్పగించకుండా ఆ డబ్బును సొంత అవసరాలకు, విలాసాలకు ఉపయోగించుకున్నాడు. బినామీ పేర్లతో ఆస్తులను బదిలీ చేశాడు. డబ్బు చెల్లించిన బాధితులు ఇతని మోసం తెలుసుకుని డబ్బు కోసం ఒత్తిడి తెచ్చారు.
చనిపోయినట్లు నాటకం...
బాధితుల ఒత్తిడి భరించలేని వంశీకృష్ణ గట్టి ప్లాన్ వేశాడు. 2011 జనవరి 3న తన తల్లితో కలిసి విజయవాడ నుంచి తెనాలి వెళ్తుండగా తాను డ్రైవ్ చేస్తున్న కారు దుగ్గిరాల వద్ద ప్రమాదానికి గురైనట్లు నాటకం ఆడి ఆచూకీ లేకుండా పరారయ్యాడు. అదే నెల 11 తర్వాత చెన్నై, కోయంబత్తూరు వెళ్లాడు. కొన్నాళ్ల తర్వాత బెంగళూరు వెళ్లి ఆన్‌లైన్ ట్రేడింగ్ చేశాడు. తర్వాత హైదరాబాద్, అహ్మదాబాద్‌లలో ఉన్నాడు. తర్వాత వైజాగ్‌లో స్థిరపడ్డాడు. ఊరు, పేరు మార్చుకున్నాడు. అప్పటికే మొదటి భార్య ైశె లజకు విడాకులు ఇచ్చిన వంశీకృష్ణ తర్వాత డాక్టర్ పసుపులేటి ప్రవీణను ద్వారకాతిరుమలలో దండలు మార్చుకొని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రవీణతో విశాఖలో టచ్ ఆస్పత్రిని ప్రారంభించి విలాసాల్లో మునిగిపోయాడు. ఇప్పటివరకు బాధితులు ఇచ్చిన వివరాల ప్రకారం రూ.8 కోట్లు మోసం చేశాడు. కృష్ణలంక పోలీస్‌స్టేషన్ కేసులో అతన్ని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపుతున్నట్లు డీసీపీ వెల్లడించారు.
తల్లిని, రెండో భార్యనూ విచారిస్తాం...
వంశీకృష్ణపై వేర్వేరు స్టేషన్లలో 10 కేసులు నమోదయ్యాయని డీసీపీ వెల్లడించారు. వీటిపై విచారణ చేపట్టినట్లు చెప్పారు. వంశీకృష్ణ తల్లి క్షేమంగానే ఉన్నారని, ఆమె పరారీలో ఉన్నారని తెలిపారు. ఆమెను, డాక్టర్ ప్రవీణను కూడా తీసుకొచ్చి విచారిస్తామన్నారు. అతని ఆస్తులకు సంబంధించి నలుగురైదుగురు బినామీలు ఉన్నారని చెప్పారు. వారి వివరాలు వెల్లడించడానికి నిరాకరించారు. మొదటి భార్య శైలజతో మాట్లాడామని, అతని వేధింపులు భరించలేక విడాకులు తీసుకున్నట్టు చెప్పారని వివరించారు. విలేకరుల సమావేశంలో ఏసీపీ నాగేశ్వరరావు, సీఐ టీఎస్‌ఆర్కే ప్రసాద్, ఎస్సై సత్యనారాయణ పాల్గొన్నారు.
చనిపోవాలనుకున్నా... : నార్ల వంశీకృష్ణ
వంశీకృష్ణతో విలేకరులతో మాట్లాడుతూ చనిపోవాలని నిర్ణయించుకున్నాననీ... కానీ పథకం రచించలేదనీ... చివరకు మనసు మార్చుకున్నానని చెప్పాడు. మూడు, నాలుగు కోట్లకు మించి లావాదేవీలు జరగలేదన్నాడు. తాను ఎవరినీ మోసం చేయలేదన్నాడు. తానే 95 శాతం నష్టపోయానన్నాడు. ఐదు శాతం బాధితులు నష్టపోయి ఉండొచ్చన్నాడు. తన వెనుక రాజకీయ నాయకులు ఎవరూ లేరన్నాడు. వడ్డీల భారం ఎక్కువై ఆర్థిక భారం పెరిగి ఇలా అయిందన్నాడు. తనవల్లే అందరూ లాభపడ్డారన్నాడు.
చీటర్ వంశీకృష్ణ అరెస్టు
Published Sun, Nov 24 2013 1:55 AM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM
Advertisement