=సీఎం చేతుల మీదుగా జాతికి అంకితం
=అదేరోజు సాయంత్రం విజయవాడలో సభ
=ఐదు గేట్లు మినహా ప్రాజెక్టు అంతా పూర్తి
=మాధ్యమిక విద్యా శాఖ మంత్రి పార్థసారథి వెల్లడి
సాక్షి, విజయవాడ : పులిచింతల ప్రాజెక్టు ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేతులమీదుగా ఈ నెల ఏడో తేదీన చేపడుతున్నట్లు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అదేరోజు మధ్యాహ్నం మూడు గంటలకు విజయవాడ స్వరాజ్య మైదానంలో రెండు లక్షల మందితో భారీ సభ నిర్వహిస్తామన్నారు. సభా ప్రాంగణానికి కాకాని వెంకటరత్నం పేరు పెడుతున్నట్లు చెప్పారు. పులిచింతల ప్రాజెక్టు నమూనాను ప్రాంగణం వద్ద ఏర్పాటు చేస్తామన్నారు. పులిచింతల ప్రాజెక్టు 40 టీఎంసీల సామర్థ్యంతో కూడుకున్నదన్నారు. మొదటి ఏడాది 20 టీఎంసీలకు మించి నింపబోరని చెప్పారు. 19 గేట్లు పూర్తిచేశారని... ఇంకా ఐదు గేట్లు చేయాల్సి ఉందని తెలిపారు. ఈ నెలాఖరు నాటికి గేట్లన్నీ పూర్తవుతాయన్నారు.
గుంటూరు జిల్లాలో పైలాన్...
పులిచింతల ప్రాజెక్టు ప్రారంభ పైలాన్ గుంటూరు జిల్లాలో ఉంటుందని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం ప్రారంభిస్తే... కిరణ్‌కుమార్‌రెడ్డి వాటిని పూర్తిచేస్తున్నారన్నారు. వైఎస్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెడితే... అందులోని లొసుగులను కిరణ్‌కుమార్‌రెడ్డి సరిదిద్దారని చెప్పారు. 60-70 ఏళ్లున్నవారు కూడా ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాన్ని ఉపయోగించుకోవడాన్ని కిరణ్‌కుమార్‌రెడ్డి సరిదిద్దారని చెప్పారు. కిరణ్‌కుమార్‌రెడ్డిని గుడ్ గవర్నెన్స్ అవార్డుకు ఎంపిక చేయడం ఆనందదాయకమన్నారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే తమ ఉద్దేశమన్నారు. ఆఖరి నిమిషం వరకు అందుకోసం పోరాడతామని తెలిపారు. నేరస్తులైన ప్రజాప్రతినిధుల విషయంలో వచ్చిన ఆర్డినెన్స్‌ను రాహుల్‌గాంధీ చింపివేయలేదా.. అని అంటూ అలాగే తెలంగాణ విషయంలో జరగొచ్చన్నారు. ప్రతిపక్షాలు చెప్పడం వల్లే వారు విభజన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మార్క్‌ఫెడ్ చైర్మన్ కంచి రామారావు, డీసీసీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు పాల్గొన్నారు.
‘పులిచింతల’ ప్రారంభోత్సవం 7న
Published Mon, Dec 2 2013 1:50 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement