‘బడి’ దుడుకులు
పుస్తకాల సంచి తగిలించుకొని బడిబాట పట్టిన విద్యార్థులకు గురువారం మొదటి రోజే కఠిన పరీక్ష ఎదురైంది. వేసవి సెలవుల్లో దుమ్ముపట్టిన తరగతి గదులను శుభ్రం చేసే బాధ్యత వారిపై పడింది. బల్లలు సర్దుతూ.. బండలు తుడుస్తూ పడరాని పాట్లు పడాల్సి వచ్చింది. ఓ వైపు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు వ్యతిరేకంగా ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తూనే మరోవైపు పిల్లలతో టీచర్లు దగ్గరుండి పనులు చేయించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
బడి గంట మోగింది. 50 రోజుల పాటు వేసవి సెలవులను ఎంజాయ్ చేసిన విద్యార్థులు మొదటిరోజు అయిష్టంగానే పాఠశాల గడప తొక్కారు. శుక్రవారం ఏరువాక పౌర్ణమి కావడం, ఆ తర్వాత రెండో శనివారం, ఆదివారం ఉండటంతో తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. మరోవైపు వచ్చిన విద్యార్థులతోనే ఉపాధ్యాయులు పాఠశాలలను శుభ్రం చేయించారు. కొన్ని పాఠశాలల్లో మద్యం బాటిళ్లు కనిపించాయి. వాటిని సైతం విద్యార్థులచే తీసి వేయించారు.
మొదటిరోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తామని అధికారులు చెప్పినా ఎక్కడా అమలు కాలేదు. పాఠశాలకు హాజరైన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల్లో చాలామంది ముచ్చట్లకే పరిమితమయ్యారు. ఇదే రోజు అధికారులు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై ర్యాలీలు నిర్వహించారు. పిల్లలతో పనిచేయించవద్దని ఉపన్యాసాలు దంచారు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులతో వెట్టి చాకిరీ చేయించేవిధానాన్ని అడ్డుకోలేకపోతున్నారు. - కర్నూలు(విద్య)