'కేంద్ర నిధులున్నా ఖర్చులో వెనకబడ్డాం'
- ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలోనే వెల్లడి
- పలు పథకాల కింద కేంద్ర, రాష్ర్ట నిధులు రూ. 11,116 కోట్లు కేటాయింపు
- ఇందులో విడుదల చేసింది రూ. 8,257 కోట్లు అయితే.. ఖర్చు పెట్టింది 6,820 కోట్లే
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ పథకాల కింద నిధులు అందుబాటులో ఉన్నా ఖర్చు చేయడంలో రాష్ట్రం బాగా వెనుకబడి ఉంది. సీఎం చంద్రబాబు మంగళవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఈ విషయం వెల్లడైంది. ఆర్థిక పరిస్థితి, రెవెన్యూ లోటు, రెండంకెల అభివృద్ధి, ముగిసిన ఆర్థిక సంవత్సరం అకౌం ట్లు తేల్చడంపై మంగళవారం సచివాలయంలో సీఎం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రూ.11,116 కోట్ల కేటాయింపులున్నాయి. ఇందులోని రూ.8,850 కోట్లు కేంద్ర కేటాయింపులు. రూ.2,266 కోట్లు రాష్ట్ర కేటాయింపులు.
అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వాటాల కింద 8,257 కోట్లను విడుదల చేయగా.. వాటిని ఖర్చు చేయడంలో రాష్ట్రం వెనుకబడింది. కేవలం రూ.6,820 కోట్లను మాత్రమే వ్యయం చేసింది. రెండంకెల అభివృద్ధి సాధించాలంటే కేంద్ర పథకాల కింద అందుబాటులో ఉన్న నిధులను వ్యయం చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర వాటా నిధులను విడుదల చేయడంలో జాప్యం చేయవద్దని ఆర్థికశాఖకు ఆయన సూచించారు. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద కేంద్రం రూ.2,500 కోట్లను కేటాయించినప్పటికీ రూ.1,700 కోట్లే రాష్ట్రం ఖర్చు చేసింది. రాజధాని నిర్మాణానికి, అక్కడ మౌలిక వసతుల కల్పనకు కేంద్రం విడుదల చేసిన 1,500 కోట్లను వెంటనే వ్యయం చేయాలని, అప్పుడే కేంద్రాన్ని మళ్లీ నిధులు అడగ్గలమని సీఎం పేర్కొన్నారు.
ఆ రెండు నెలల రెవెన్యూలోటు రూ.8 వేల కోట్లు..
ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన రెండు నెలల(గతేడాది ఏప్రిల్, మే నెలల) రెవెన్యూ లోటును రూ.8 వేల కోట్లుగా తేల్చారు. ఇందులో 58 శాతం నిధులను రెవెన్యూ లోటు భర్తీ కింద కేంద్రాన్ని కోరాలని నిర్ణయించారు. ఇక రాష్ట్రం విడిపోయాక.. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో పది నెలల రెవెన్యూలోటు రూ.10 వేల కోట్లకుపైగా ఉంటుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ముగిసిన ఆర్థిక సంవత్సరం అకౌంట్లను వీలైనంత త్వరగా తేల్చాలని అకౌంటెంట్ జనరల్‌కు సీఎం సూచించారు.
పట్టణాలకు సరిపోయేలా ప్రణాళికలు
వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలోని పట్టణాల రూపురేఖలను మార్చాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇందుకోసం సకల సౌకర్యాలు కల్పించాలన్నా రు. సచివాలయంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు, మెప్మా, ప్రజారోగ్య శాఖ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. క్రీడలు, టూరి జం, రోడ్లు, భవనాలు, విద్యుత్, పోలీసు శాఖల సంయుక్త నిర్వహణలో పట్టణాలకు ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. పట్టణాల్లో సంస్కరణలు చేపట్టే ముందు ప్రజలతో చర్చించి, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.