విశాఖలో ఐఐటీకి శంకుస్ధాపన చేస్తున్న కేంద్రమంత్రి సురేశ్ ప్రభు, సీఎం చంద్రబాబు
విశాఖపట్నం నుంచి ‘సాక్షి’ప్రత్యేక ప్రతినిధి: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈడీబీ) ర్యాంకుల్లో తాము భారతదేశం కంటే ముందంజలో ఉన్నామని, ప్రపంచ దేశాలతోనే తమకు పోటీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా ఆదివారం ‘రిఫామ్ కాలిక్యులస్–ప్రమోటింగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’అనే అంశంపై జరిగిన సెమినార్‌లో ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఈడీబీ ర్యాంకుల్లో భారత్ ప్రస్తుతం 100వ స్థానంలో ఉందని, రాష్ట్రానికి వచ్చిన పాయింట్ల ఆధారంగా చూస్తే ఏపీ 88వ ర్యాంకులో ఉంటుందన్నారు. 86.6 పాయింట్లతో న్యూజి లాండ్ మొదటి స్థానంలో ఉండగా, 60.8 పాయింట్లతో ఇండియా 100వ స్థానంలో ఉందని తెలిపారు. దేశంలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు 63.6 పాయింట్లు వచ్చాయని, వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఏపీకి 88వ ర్యాంకు వస్తుందన్నారు. దేశంలో తాము మొదటి స్థానంలో కొనసాగుతామని, తమకు ఇక్కడ ఎవరూ పోటీ కాదని వెల్లడించారు. ప్రపంచంలో టాప్–5 దేశాల్లో ఒకటిగా ఎదగడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
కేంద్రం వేగంగా స్పందించాలి
దేశీయంగా తమ ర్యాంకు మూడు నెలల్లో 64, 9 నెలల్లో 40కి చేర్చేందుకు రెండు లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు చంద్రబాబు వివరించారు. ఈడీబీ ర్యాంకుల లెక్కింపులో ప్రధానంగా 10 అంశాలను పరిగణనలోకి తీసుకుంటారని, ఇందులో 7 అంశాలు కేంద్రం పరిధిలో, 3 అంశాలు రాష్ట్రం పరిధిలో ఉంటాయన్నారు. కాబట్టి కేంద్రం వేగంగా స్పందిస్తే ర్యాంకు మరింత మెరుగవుతుందన్నారు.
కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహం
నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. కొత్త ఆవిష్కరణలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. సీఐఐ సదస్సులో ‘టెక్నాలజీస్ ఫర్ టుమారోస్’అనే అంశంపై సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు.
ప్లీజ్ ఆఫ్ డూయింగ్ ఉండాలి: సురేష్ ప్రభు
దేశంలో చేపట్టిన సంస్కరణల వల్ల ఈడీబీలో ఇండియా ర్యాంకు మరింత మెరుగవుతుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం సీసీఐ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో ఆయన మాట్లాడుతూ.. వ్యాపారం అనేది సంతోషంగా చేయాలని, అందుకే ఈజ్ ఆఫ్ డూయింగ్ కాకుండా ప్లీజ్ ఆఫ్ డూయింగ్ ఉండాలని సూచించారు. రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ నియమ నిబంధనలకు సంబంధించిన బుక్‌లెట్‌ను సురేష్ ప్రభు ఆవిష్కరించారు. అనంతరం కాకినాడలో ఏర్పాటు చేస్తున్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(ఐఎఫ్‌టీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్(ఐఐపీ) క్యాంపస్‌లకు శంకుస్థాపన చేశారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో రూపొందించిన ఈ–స్పైస్ బజార్ వెబ్ పోర్టల్‌ను ప్రారంభించారు. ‘ఎంపెడా’రూపొందించిన ఎన్‌రోల్‌మెంట్ కార్డులను ఆక్వా రైతులకు అందచేశారు.
Comments
Please login to add a commentAdd a comment