వలస నేతలతో పార్టీ కట్టు తప్పుతోంది | CM Chandrababu comments on Immigrant leaders | Sakshi
Sakshi News home page

వలస నేతలతో పార్టీ కట్టు తప్పుతోంది

Published Tue, May 30 2017 1:16 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

వలస నేతలతో పార్టీ కట్టు తప్పుతోంది - Sakshi

వలస నేతలతో పార్టీ కట్టు తప్పుతోంది

‘తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరు..అలాంటి పార్టీలో నేడు క్రమశిక్షణ లోపిస్తోంది.. పార్టీ నేతలు క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారు.

- పార్టీలో క్రమశిక్షణ లేదు.. మావాళ్లు గీత దాటుతున్నారు
ఇతర పార్టీల నుంచి వచ్చిన వారితోనే సమస్య
మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
 
విశాఖ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరు..అలాంటి పార్టీలో నేడు క్రమశిక్షణ లోపిస్తోంది.. పార్టీ నేతలు క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారు. సమస్యంతా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి వల్లే. వారిని కలుపుకొని పార్టీలో ఉన్న పాతతరం, యువతరం ముందుకెళ్లలేక పోతోంది. లక్ష్మణరేఖ దాటుతున్నారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. తమ పార్టీలోని క్రమశిక్షణా రాహిత్యాన్ని నర్మగర్భంగా అంగీకరించారు. అన్నీ సెట్‌రైట్‌ చేస్తా.. అందుకే తెలంగాణా పార్టీపై దృష్టి పెట్టలేకపోతున్నా... అక్కడి వారికి సమయం కేటాయించలేకపోతున్నా.. అని చెప్పుకొచ్చారు. మహానాడు అనంతరం ఆయన  మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నిక విషయంలో ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.

తెలంగాణాలో ఒకలా.. ఆంధ్రాలో మరోలా బీజేపీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన స్పందిస్తూ.... ఇలాంటి అంశాలపై అంతర్గతంగా తాము చర్చించుకుంటామని,, ప్రతి విషయంలోనూ రోడ్డెక్కి మాట్లాడలేమని తెలిపారు. జీవీఎంసీతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్, మున్సిపల్‌ ఎన్నికల న్నీ ఒకేసారి జరుగుతాయని స్పష్టంచేశారు. వచ్చే ఏడాదిలోగా స్థానిక సంస్థల ఎన్నికలన్నీ పూర్తి చేస్తామని, ఆ తర్వాతే సార్వత్రిక ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. నిరుద్యోగభృతి విధానంపై అధ్యయనం చేస్తున్నామని, ఏ దేశంలో మంచి చేయూతనిస్తున్నారో గమనించి దాన్ని రాష్ట్రంలో అమలు చేస్తామని తెలిపారు. ఇప్పటివరకు 90 లక్షల మంది వ్యూయర్స్‌ ట్విటర్స్, ఫేస్‌బుక్‌లో మహానాడు చూశారన్నారు. సమావేశంలో ఏపీ, తెలంగాణా పార్టీ శాఖల అధ్యక్షులు కళా వెంకట్రావు, ఎల్‌. రమణ పాల్గొన్నారు.
 
భావి తరాలకు నా కానుక అమరావతి
భావితరాలకు తానిచ్చే కానుకే ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి అని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రజారాజధాని నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టు తనకు రెండు కళ్లు లాంటివన్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న మహానాడు మూడో రోజయిన సోమవారం ‘ప్రజారాజధాని అమరావతి’పై పెట్టిన తీర్మానంపై ఆయన ప్రసంగించారు. ప్రపంచంలోని ఐదు ముఖ్యమైన రాజధాని నగరాల్లో అమరావతి ఒకటిగా ఉండేలా అంతర్జాతీయ ప్రమాణాలతో తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మిస్తానని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంలో ఆయన నూతన రాజధాని కోసం పడుతున్న ఇక్కట్లను, చేస్తున్న కృషిని సోదాహరణంగా వివరించారు. ఇప్పటికే తాత్కాలిక సచివాలయం, శాసనసభ, శాసనమండలిని కేవలం ఏడాదిలోగా పూర్తి చేశామన్నారు.

హైదరాబాద్‌ను తాను ఎలా అభివృద్ధి చేసిందీ, ఆ సమయంలో తాను ఎలా కష్టపడిందీ ఏకరవు పెట్టారు. ఇప్పుడు కూడా తాను అన్ని అవరోధాలను అధిగమించి రాజధానిని నిర్మిస్తానని, శంకుస్థాపనే బ్రహ్మాండంగా జరిగిందని, అన్ని ప్రార్థనా మందిరాల నుంచి ఆశీర్వచనాలు తెప్పించామని తెలిపారు. బలోపేతమాన రాజధానిని నిర్మించేందుకు ఎంత కష్టమైనా పడతానని, తన అనుభవాన్ని పూర్తిగా రంగరించి ముందుకు సాగుతానని చెప్పారు. రాజధానికి రైతులు సుమారు రూ.40వేల కోట్ల విలువైన 33,388 ఎకరాల భూమిని ఇచ్చారని, వారందరికీ వేలవేల దండాలు చెప్పాలన్నారు.

వందేళ్ల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మూడు ప్రణాళికలు తయారు చేశామని, కేపిటల్‌ సిటీ, కేపిటల్‌ రీజియన్‌ కాన్సెప్ట్, సీడ్‌ కేపిటల్‌ ఏరియాలుగా విభజించామని తెలిపారు. లండన్‌కు చెందిన నార్మన్‌ అసోసియేట్స్‌ ఇస్తున్న ఐకానిక్‌ బిల్డింగ్‌ డిజైన్స్‌ దాదాపు పూర్తి కావొచ్చాయని చెప్పారు. అమరావతి అంటే తెలుగు జాతి గుర్తుకువచ్చేలా డిజైన్‌ చేస్తున్నట్టు వివరించారు. ఈ తీర్మానాన్ని మంత్రి నారాయణ ప్రవేశపెట్టగా శ్రావణ్‌కుమార్‌ మద్దతిచ్చారు. చంద్రబాబు మాట్లాడిన అనంతరం తీర్మానాన్ని ఆమోదించినట్టు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement