
టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు కొందరు నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
సాక్షి, అమరావతి: టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు కొందరు నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సి, డి గ్రేడ్లల్లో ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తెలుగుదేశం పైనా చర్చ సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం జరుగుతున్న తీరును జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆయనకు వివరించారు. ఇప్పటికీ నలభై నియోజకవర్గాలు సీ, డీ గ్రేడుల్లోనే ఉన్నాయని లోకేష్ తెలిపారు. మున్సిపల్ శాఖకు సంబంధించే అత్యధిక ఫిర్యాదులందాయని పేర్కొన్నారు.
కమిటీ భేటీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశం ప్రస్తావనకు వచ్చింది. పని చేసే వారికే పదవుల భర్తీలో ప్రాధాన్యమని చంద్రబాబు స్పష్టం చేవారు. ఇంటింటికీ తెలుగుదేశంలో సి, డి గ్రేడ్లల్లో ఉన్న ఎమ్మెల్యేలకు, ఇన్‌చార్జ్‌లకు బాబు క్లాస్ తీసుకున్నారు. ‘మహానుభావుల పనితీరు ఇదేనా’ అంటూ వారిపై వ్యాఖ్యలు చేశారు. మచిలీపట్టణం పార్లమెంట్ పరిధిలోని పామర్రు, గన్నవరం, పెనమలూరు, అవనిగడ్డ నియోజకవర్గాలు సి-గ్రేడ్ లో ఉండటంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. అందరినీ గాడిలో పెట్టాలని ఇంచార్జి మంత్రి యనమలకు బాబు సూచన చేశారు. అలాగే గండికోట ప్రాజెక్ట్ పనుల్లో ఆలస్యంపై చంద్రబాబు అసంతృప్తి చెందారు. కాంట్రాక్టర్లు ఎవరైనా సరే పనిలో జాప్యం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. అవసరం అయితే పోలీసుల్ని పంపుతామని వ్యాఖ్యలు చేశారు. కాగా సమన్వయ కమిటీ సమావేశం కొనసాగుతోంది.