
కాశీబుగ్గ/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తిత్లీ తుపాను ఊహించని రీతిలో దెబ్బతీసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శ్రీకాకుళం జిల్లాని అతలాకుతలం చేసిందని, ఎన్నడూ లేని విధంగా ఉద్దానం ప్రాంతంలో జీడి మామిడి, కొబ్బరి పంటలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు గురువారం ఉదయం శ్రీకాకుళం నుంచి హెలికాప్టర్‌లో పలాస చేరుకున్నారు. కాశీబుగ్గలోని పోలీసు పరేడ్ గ్రౌండ్‌లోని హెలిప్యాడ్ నుంచి కాన్వాయ్‌లో పలాస శివారులోని జీడితోటలను పరిశీలించేందుకు బయల్దేరారు. మార్గమధ్యంలో శాంతినగర్ కాలనీ వాసులు కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. నేరుగా పలాస శివారులోని అక్కుపల్లి గ్రామానికి వెళ్లిన సీఎం అక్కడ తిత్లీ తుపానుతో దెబ్బతిన్న జీడితోటలను పరిశీలించారు. బాధిత రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తర్వాత తిరిగి పలాస మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే మీడియాతో మాట్లాడారు. తర్వాత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
తుపానుతో ఏడుగురు చనిపోయారని, వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున తక్షణ సాయం అందిస్తామన్నారు. బాధితులకు ఆహారం, కిరాణా సామగ్రి అందిస్తామన్నారు. ఇప్పటివరకు 600 విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయని, ఇతర ప్రాంతాల నుంచి సిబ్బందిని తీసుకుని వచ్చి వాటిని సరిచేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. 100 మంది ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు ఇతర అధికారులను టీమ్‌లుగా వేస్తున్నామని చెప్పారు. సాధారణ కుటుంబాలకు 25 కేజీల బియ్యం, 1 కేజీ పప్పు, 1 కేజీ పొటాటోస్, లీటర్ ఆయిల్ ప్యాకెట్, అరకేజీ పంచధార అందజేస్తామన్నారు. మత్స్యకారులకు 50 కేజీలు అందిస్తామన్నారు. పశువులు చనిపోతే ఒక్కోదానికి రూ.10 వేలు, గొర్రె, మేకలకు రూ.5 వేలు, రేకులు, బడ్డీలుకు రూ.10 వేలు చొప్పున అందిస్తామని చెప్పారు. ఇళ్లు పడిపోతే రూ.1.50 లక్షలు, ఎస్సీల ఇళ్లకు రూ.2 లక్షలు, ఎస్టీల ఇళ్లు పోతే రూ.2.50 లక్షలు ఇస్తామన్నారు. కొబ్బరి, జీడి చెట్లు భారీగా పడిపోయాయని, వాటిని సర్వే చేసి తగిన నష్ట పరిహారం అందిస్తామన్నారు. తమ ఇళ్లు పడిపోయిన ఫొటోలను ప్రజలు క్లౌడ్ ద్వారా అప్‌లోడ్ చేయాలన్నారు. అధికారులు తక్షణమే చర్యలు చేపట్టకపోతే సస్పెండ్ చేస్తామన్నారు. సీఎంతోపాటు జిల్లా కలెక్టర్ కె.ధనంజయ రెడ్డి, మంత్రి పి.సత్యంనారాయణ, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శివాజీ తదితరులు పాల్గొన్నారు.
తుపాను కష్టంలో మేముంటే.. ఐటీ దాడులా?
తిత్లీ తుపాను బీభత్సంతో తాము ఇబ్బందుల్లో ఉంటే తమ నాయకులపై ఐటీ దాడులు నిర్వహిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పలాసలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్‌డీఏతో కలిసి ఉన్నన్నాళ్లు ఒక్కమాట అనేవారు కారని ఇప్పుడు అన్నిరకాల దాడులతోపాటు బాబ్లీ విషయాన్నీ తెరపైకి తెచ్చారన్నారు. ఇప్పుడు కోర్టూ, కేసులు అంటూ చెబుతున్నారన్నారు. కేంద్రం తీరు ఇలా ఉందని మండిపడ్డారు. హుదుహుద్ తుపాను సమయంలో రూ.వెయ్యి కోట్లు మంజూరు చేసిన కేంద్రం ఇంతవరకు రూ.450 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు.